వరికి బదులుగా ఇతర పంటలు పండించాలి

Published: Friday December 10, 2021
చేవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 09 డిసెంబర్ ప్రజాపాలన : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొనేలా గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి సూచించారు. గురువారం స్థానిక డిపిఆర్సి భవనములో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై అవగాహన కార్యక్రమము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, యాసంగిలో పండించే వరి పంటను కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (FCI) ద్వారా కొనుగోలు చేయదని స్పష్టంగా తెలిపినందున రైతులు నష్టపోకుండా ఉండేందుకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకొనేలా క్లస్టర్ల వారిగా రైతులకు అవగాహన కలిపించాలని వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు. దీనికి బదులు పామ్ ఆయిల్ పంట చాలా లాభదాయకమని తెలిపారు. లక్ష కోట్ల ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నామని, అతి త్వరలో జిల్లాలో పామ్ ఆయిల్ పరిశ్రమను చేయనున్నామని తెలిపారు.  దీనితో పాటు జనవరి మాసం వరకు జొన్న, పెసర, మినుములు, నువ్వుల పంటలను వేసుకొనేందుకు వీలు పడుతుందన్నారు. అందరు ఒకే రకం పంట కాకుండా వేరు వేరు పంటలు పండించుకుంటే లాభదాయకమన్నారు. ప్రతిసారి ఒకే పంట పండిస్తే భూసారం తగ్గుతుందని, మధ్యలో గ్యాప్ ఏర్పడి ఇతర పంటలు వేసుకుంటే మంచి డిమాండ్ తో అధిక లాభాలు చేకూరుతాయన్నారు. రైతులు ఆరుతడి పంటలు పండించేందుకు సిద్ధంగా ఉంటే అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ సూచనల మేరకు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా వరి నారు వేయలేదని తెలిపారు.  గ్రామాలలో రైతులు ఇతర పంటలు పండించేందుకు సిద్దమయ్యారని, వారికి పంట మార్పిడిపై అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు 70 వేల ఎకరాలలో వరి పంట సాగు చేయడం జరిగిందని, బొమ్రాసిపేట మండలంలో ఎక్కువగా 10 వేల ఎకరాలలో వరి సాగు చేయడం జరిగిందన్నారు. 70 వేల ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామం, హాబిటేషన్ లలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వ్యవసాయ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు నష్టపోకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, మండల వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, సైంటిస్ట్ లు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, రైతు బంధు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.