గోదావరిలో చిక్కుకున్న మేకల కాపరులను రక్షించిన సహాయ బృందాలు

Published: Friday July 15, 2022

మంచిర్యాల బ్యూరో, జూలై14, ప్రజాపాలన:

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి వరదలో చిక్కుకున్న  మేకల కాపరుల ఇద్దరిని   సహాయ బృందాలు కాపాడాయి.
గురువారం హెలికాప్టర్ ద్వారా రక్షించారు. బుధవారం మేకలను కాసేందుకు వెళ్లిన కాపరులు వెనక్కి వచ్చే సమయంలో వరద ముంచెత్తింది. దీంతో వారిద్దరూ అక్కడున్న వాటర్ ట్యాంక్ ఎక్కేశారు. వరద ఉద్ధృతి తీవ్రం కావడంతో ఎవరు వారిని కాపాడే సాహసం చేయలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వారిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. హుటాహుటిన హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరిని తరలించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. హెలికాప్టర్ ద్వారా తమని కాపాడినందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి కేటిఆర్ లకు మేకల కాపరులు ధన్యవాదాలు తెలిపారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన 

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ ఉన్న గోదావరి బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. చుట్టూ పక్కల 2 కిలోమీటర్ల మేర నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి గోదావరిఖని గంగానగర్, ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా వంతెన పై వాహనాలను అనుమతించ కూడదని తెలిపారు. వంతెనకు  ఇరువైపుల నుంచి వరద నీరు ప్రవహిస్తుంన్నందున వాహనాలు దారి మళ్లించాలని, అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ అప్రమత్తంగా వ్యవహారించాలని సీపీ సూచించారు.