శ్మశాన వాటిక స్థలంలో అక్రమంగా నిర్మించిన వ్యాపార సముదాయాల్ని కూల్చి వేయాలి

Published: Tuesday August 31, 2021
బెల్లంపల్లి ఆగస్టు 30 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపెల్లి మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని శంషేర్ నగర్ లోని స్మశాన వాటిక స్థలంలో అక్రమంగా నిర్మించిన  వ్యాపార సముదాయాలను వెంటనే  కూల్చివేసి మా తాతల తండ్రుల సమాదులను రక్షించాలని పట్టణ అఖిలపక్ష కమిటీ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ కేటీఆర్ కు పంపిన విజ్ఞాపన పత్రంలో విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ కు పంపిన విజ్ఞాపన పత్రాన్ని పత్రికల వారికి విడుదల చేస్తూ ఆయన మాట్లాడుతూ 1967లో అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించగా అప్పటినుండి స్థానిక ప్రజలు అందులో సమాధులు ఏర్పాటు చేసుకుని దహన సంస్కారాలు నిర్వహించుకుంటూ స్మశాన వాటికకు ఉపయోగిస్తూన్నారని అన్నారు. ఇటీవల టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వార్డ్ కౌన్సిలర్ (తెరాస) పత్తిపాక రాజ్ కుమార్  ప్రధాన రహదారి వైపు ఉన్న స్థలాన్ని మా తాతల తండ్రుల  సమాధులను ఆనుకొని అధికార బలంతో స్థలాన్ని స్వాధీనపరచుకొని రూములు నిర్మించి అద్దేకు ఇస్తూ స్మశాన వాటిక స్థలాని కబ్జా చేస్తున్నాడని వాటిని తొలగించాలని స్థానిక ఎమ్మార్వోకు, ఆర్ డి ఓ కు, సబ్ కలెక్టర్కు, చివరకు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామనీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఏమీ చేయలేని స్థితిలో చివరకు మున్సిపల్ శాఖ మంత్రి కి ఫిర్యాదు చేస్తున్నానని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ గారు సమాధుల స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి మా తాతల, తండ్రుల, సమాధులను రక్షించాలని మరింత స్థలం కబ్జా కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.