ఎడతెరిపి లేని వర్షాలతో నిరంతరం సమీక్షించాలి

Published: Thursday July 14, 2022
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో జూలై 13 ప్రజాపాలన :
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తున్నారన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని, 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని సమీక్షించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్ పి లు జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అన్నారు. గ్రామ,మండల,జిల్లా  స్థాయిలలో  ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి అలెర్ట్ గా ఉండాలని సూచించారు. రవాణాకు ఆటంకం కలుగకుండా,జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికే  పాత,శిథిలావస్థకు చేరిన  భవనాలు తొలిగించినట్లు,ఇంకా ఏమైనా మిగిలి ఉంటే,అందులో ప్రజలు ఉండకుండా గ్రామ టీంలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు గ్రామ కార్యదర్శులు కూడా వాగులు,వంకల వద్ద,చెరువులు,కుంటల వద్ద చర్యలు తీసుకోవాలి. అలెర్ట్ గా ఉండాలి,ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా  చూడండి.
ఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్ అధికారులు వర్షాల వల్ల ఏర్పడ్డ గుంతలు పూడ్చి,మరమ్మతులు చేపట్టాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి,వైద్య ఆరోగ్య శాఖ,మునిసిపల్,పంచాయితీ రాజ్,శాఖలు ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. పాఠశాలలను సందర్శించి, పాత భవనాలు గుర్తించండి.పాఠశాలలలో శానిటేషన్ పనులు చేపట్టాలి. బాచారం,డోర్నాల లలో పనులు త్వరగా పూర్తి చేయాలి.

సమావేశానికి హాజరైన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల,ఎస్ పి కోటిరెడ్డి, జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ, జడ్పీ సి ఈ ఓ జానకి రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.