పట్లూరులో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి : ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్.

Published: Saturday December 11, 2021
వికారాబాద్ బ్యూరో 10 డిసెంబర్ ప్రజాపాలన : ఓమిక్రాన్ ముప్పు నుండి తప్పించుకోవాలంటే వంద శాతం వ్యాక్సినేషన్ చేయించడమే శరణ్యమని ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ హితవు పలికారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్, కార్యదర్శి సంతోషల ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణపు పనులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ స్టేట్ ఫైనాన్స్ నిధులతో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని సూచించారు. అశోక్ స్వామి ఇంటి దగ్గర పాడు బడ్డ బావిని మూసి వేసి సిసి రోడ్ వేయడం జరిగిందని పేర్కొన్నారు. చాట్ల వసంత రావు ఇంటి నుండి శేఖర్ స్వామి ఇంటి వరకు ఖానాపురం రామయ్య ఇంటి నుండి గొర్రెగట్టు వడ్ల వీరన్న ఇంటి వరకు సిసి రోడ్డు పనులు పూర్తి చేశామని సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ ఎంపీడీఓ వెంకట్ రాం గౌడ్ కు తెల్పారు. అనంతరం వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్ళి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈరోజు 55 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని ఏఎన్ఎం తెల్పారు. ఇంకా ఫస్ట్ డోస్ తీసుకోని వారు 500 మంది వరకు ఉన్నారని ఏఎన్ఎం స్పష్టం చేశారు. సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ ను వివరాలు అడుగగా వారు గ్రామంలో లేరని అందరూ హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నారని తెలిపారన్నారు. కాల్ చేసి మాట్లాడితే వ్యాక్సినేషన్ వేసుకుంటామని సమాధానం ఇస్తున్నారని సర్పంచ్ అన్నారు. గ్రామంలో 100% పూర్తి చేయుటకు గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.