బతికున్న రైతును ఆదుకోకుండా చచ్చిన రైతుకు ఆర్థిక సాయమా...!

Published: Tuesday December 06, 2022
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా
* టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై ఘాటు విమర్శ
వికారాబాద్ బ్యూరో ఐదు డిసెంబర్ ప్రజా పాలన : పంట నష్టపరిహారము ఇవ్వకుండా చచ్చినోడికి ఆర్థిక సాయం ఎందుకని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ధరణి సమస్యల పరిష్కారంపై చేపట్టిన ధర్నా కార్యక్రమానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫామ్ హౌజ్ లో నిద్రపోతున్న సీఎం కేసీఆర్ ను నిద్ర లేపేందుకు మూడింతల నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. ధరణి సమస్యలపై పోరాడేందుకు మూడు అంచల విధానాన్ని అమలు పరుస్తున్నామని వివరించారు. మూడు అంచెల నిరసన కార్యక్రమాలలో భాగంగా మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలలో నిరసన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. పోడు భూముల సమస్యలతో పాటు ధరణి సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమేశ్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 84 లక్షల మంది రైతులకు భూములు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ధరణి పేరుతో పేదల భూములను లాక్కునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ భూములను టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుని అమ్ముకుంటుందని ధ్వజమెత్తారు. 2018 సాధారణ ఎన్నికలలో సీఎం కేసీఆర్ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేడు మడమతిప్పారని దెప్పి పొడిచారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు మళ్లీ అమ్ముడుపోవడం విచిత్ర పోకడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 80,000 మంది రైతులకు రైతు బీమా అందించామని సీఎం కేసీఆర్ ఘనంగా చెప్పుకోవడం అంటే 80,000 మంది రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం చంపిందని ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు చనిపోయిన రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాణహిత చేవెళ్లను పేరు మార్చి కాలేశ్వరం పేరుతో కెసిఆర్ తన ఫామ్ హౌస్ కు తరలించుకున్నాడని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి ప్రజల పక్షాన నిలుస్తుందని భరోసా కల్పించారు. రైతుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలంబిస్తున్న ధోరణి మార్చుకోవాలని హితోపలికారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ కిసాన్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగ్గరి రత్నారెడ్డి కోట మర్పల్లి గ్రామానికి చెందిన బ్లాక్ టు అధ్యక్షుడు మల్కనెల్లి కృష్ణారెడ్డి కౌన్సిలర్లు వివిధ మండల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.