ప్రత్తి పంటలో అంతర పంటగా కందిని వేసుకోవడం ఎంతో ఉపయోగం.

Published: Thursday June 03, 2021

బెల్లంపల్లి, జూన్ 2, ప్రజాపాలన ప్రతినిధి : ప్రత్తి పంటలో అంతర సాగుగా కంది పంటను వేసుకోవడం రైతులకు ఎంతో ఉపయోగకరంగాను లాభసాటిగా ఉంటుందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేస్తూ సాధారణంగా మంచిర్యాల మరియు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రైతులు వర్షాకాలంలో అధిక విస్తీర్ణంలో ప్రత్తి పంటను సాగు చేయడం జరుగుతుందని. రైతులు సరైన అవగాహన లేనందున కేవలం పత్తి పంటనే సంవత్సరాలుగా సాగు చేయడం వల్ల నేల యొక్క పోషక విలువల స్థాయి తగ్గి పంటల దిగుబడి క్షీణించే అవకాశం ఉందని. ఇటువంటి క్రమంలో శాస్త్రవేత్తలు ప్రత్తి పంటలో కందిని ప్రతి 4 లేదా 6 లేదా 8 సాల్లకు ఒక సాలు చొప్పున కంది సాల్లు వేసుకోవాలని సూచిస్తున్నారని ఈ విధంగా కంది పంటను పత్తి పంట మధ్యలో అంతర పంటగా వేయడం వల్ల పలు లాభాలు ఉన్నాయని ఆయన సూచించారు. కంది పంటను అంతరపంటగా వేసినట్లయితే గాలిలోని నత్రజనిని స్వీకరించి నేలలోని పోషక విలువల స్థాయిని పెంచుతుందని. అంతర పంటగా కందిని వేసుకోవడం వల్ల తక్కువ ప్రదేశంలో అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉందని. ఈ విధంగా అంతర పంటలు సాగు చేయడం వల్ల ప్రధాన పంట అయిన పత్తి పంట లో వచ్చే చీడపీడలను అదుపుచేసే మిత్ర పురుగుల వృద్ధికి అవకాశం ఉంటుందని. కంది పంట వల్ల పత్తిలో ప్రధానంగా కనిపించే కలుపు సమస్యను కొంత మేరకు నియంత్రించవచ్చునని. అదేవిధంగా భూమిలోని కర్బన స్థాయిని పెంచి సూక్ష్మజీవుల యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందని. సంక్లిష్ట పరిస్థితులలో అధిక వర్షాల వల్ల గాని లేదా వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ప్రధాన పంట అయినా ప్రతి పంట నష్టపోయినట్టయితే అంతర పంట నుండి  ఆలాభాలు పొందవచ్చునని ఆయన తెలిపారు. అందువల్ల మంచిర్యాల మరియు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో పత్తిని పండించే రైతులందరూ విధిగా తమ తమ పొలాల్లో పత్తి పంట మధ్యలో కంది పంటను అంతరపంటగా వేసుకొని లాభాలను పొందడంతో పాటు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.