కంటి వెలుగు తో ప్రజల కంటి సమస్యలు దూరం. రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికత, న్యాయ, దేవా

Published: Monday January 09, 2023
మంచిర్యాల బ్యూరో,   జనవరి 8, ప్రజాపాలన :
 
రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ప్రజల కంటి సమస్యలు దూరం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికత, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమావేశ మందిరంలో ఈ నెల 18న ప్రారంభం కానున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లపై ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మీ, శాసన మండలి సభ్యులు దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం.. కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ నెల 18వ తేదీ నుండి 100 రోజుల పాటు రెండవ విడత కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 12వ తేదీ లోగా మండల పరిషత్, మున్సిపాలిటీలలో సమావేశాలు పూర్తి చేయాలని, శిబిరాలపై క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని తెలిపారు. కంటి చూపు సరిగ్గా లేక సమస్య ఎదుర్కొంటున్న వారు వైద్యం కోసం దూరప్రయాణాలు చేయవలసి ఉంటుందని, ఈ క్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వారి ప్రాంతాలలోనే అందుబాటులో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కంటి అందించడం జరుగుతుందని, కంటి పరీక్షలు అవసరమైన అందరికీ ఇది ఒక మంచి అవకాశమని తెలిపారు,  ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి జీవించే వారికి కూడా అవకాశం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గ్రామ సర్పంచ్, ఎం.పి.టి.సి.లు వారి పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు, ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ప్రభుత్వ ఆసుపత్రులు పని చేస్తున్నాయని, ఈ మేరకు కంటి వెలుగు శిబిరాల నిర్వహణ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా 950 వైద్యులను నియమించగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 255 మంది వైద్యులను ఇవ్వడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ విడత కార్యక్రమంలో లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో కృషి చేయాలని, జిల్లాలో 100 శాతం కార్యక్రమం విజయవంతం చేసేందుకు 40 వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 2 అదనపు బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలోని వార్డులు, అన్ని గ్రామాలలో 484 కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ సెలవులతో కూడిన 100 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందు కొరకు 40 పారామెడికల్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సహాయకులు ఇతరత్రా వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గం||ల నుండి సాయంత్రం 4 గం||ల వరకు శిబిరాలు నిర్వహిస్తామని, ప్రతి రోజు గ్రామీణ ప్రాంతాలలో 300 మందికి, అర్బన్ ప్రాంతాలలో 400 మందికి పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడు, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ లింగయ్య, మంచిర్యాలు, లద్ధిపేట, సగ్పూర్ మున్సిపాలిటీల చైర్మన్లు సెంట రాజయ్య, సల్మాను కాంతయ్య, ప్రభాకర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, క్యాతన్ పల్లి, చెన్నూర్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్, జెడ్.పి.టి.సి.లు, ఎం.పి.టి.సి.లు, వైద్యాధికారులు, మండల విద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.