రహదారి మూసి వేతను నిరసిస్తూ భూనిర్వాసితుల ఆందోళన

Published: Friday March 25, 2022
నస్పూర్, మార్చి 23, ప్రజాపాలన ప్రతినిధి: శ్రీరాంపూర్ ఉపరితల గని పరిధిలోని సింగపూర్,తాళ్ళపల్లి మధ్య రహదారిని సింగరేణి అధికారులు బుధవారం మూసివేశారు. సింగపూర్, తాళ్లపల్లి గ్రామాల మధ్య రహదారి మూసివేత పనులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టారు. భూనిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా సింగరేణి అధికారులు రహదారి ముసివేయడం ఏంటని ప్రశ్నించారు. జైపూర్ ఏసీపీ నరేందర్ సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకుండా ఆందోళనలు చేపట్టారు. పోలీసులకు, భునిర్వాసితులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆందోళన చేపడుతున్న భూనిర్వాసితులను పోలీసులు అదుపులోకి తీసుకొని శ్రీరాంపూర్, జైపూర్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అనంతరం సింగరేణి అధికారులు రహదారిని మూసి వేశారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని భూనిర్వాసితులు తెలిపారు.