ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం

Published: Friday June 17, 2022
రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
వికారాబాద్ బ్యూరో జూన్ 16 ప్రజాపాలన :
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలన్నీ ఈరోజు నెరవేర్చడం జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.  కొడంగల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 50 పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని, డయాలిసెస్ సెంటర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలురు), కూరగాయల మార్కెట్, సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు.  అలాగే సమీకృత వెజ్ & నాన్-వెజ్ మార్కెట్ సముదాయన్ని, మున్సిపల్ కార్యాలయ భావన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  స్థానిక ప్రజలు వైద్య సేవలకు వికారాబాద్, తాండూర్ లేదా మహబూబ్ నగర్ లకు వెళ్లే వారని,  స్థానికులకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు 50 పడకల ఆసుపత్రిని డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందన్నారు.  ఒక్క పైస ఖర్చులేకుండా ఈరోజు నుండి డయాలసిస్ సేవలు అందించడం జరుతుందన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నందున వారి పిల్లలకు మంచి విద్యా అందించేందుకు రూ. 4.20 కోట్ల ఖర్చుతో గిరిజన గురుకుల పాఠశాలను అన్ని హంగులాటి నిర్మించి ప్రారంభంభీంచడం జరిగిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మిషన్ భగీరథ నీరు, 24 గంటలు నాణ్యమైన విద్యుత్, రూ. 2,016/- చొప్పున ఆసరా పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు.  57 సంవత్సరాలు నిండిన అర్హులైన 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు రెండు నెలలలో మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.  అంతే గాక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం క్రింద  ఒక లక్ష 116 రూపాయలు  చొప్పున అందించడం జరుగుతుందన్నారు.  అభయ హస్తం డబ్బులను నెల రోజులలో ఇప్పిస్తానని, వడ్డీ లేని రుణాలు కూడా శాసన సభ్యులు  చేతుల మీదుగా అందిస్తానని అన్నారు. ప్రభుత్వ అసువత్రులలో మెరుగైన వైద్య సేవలకు గాను డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన X-Ray ఇతర పరికరాలు అందిస్తామని తెలిపారు.  కొడంగల్ ఆసుపత్రికి 108 అంబులెన్సు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.  నియోజకవర్గంలో అవసరమైన మూడు పల్లె దవఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  ఆసుపత్రికి అవసరమైన పోస్ట్ మార్టం గదిని నిర్మింపజెస్తామన్నారు. గతంలో తండాలుగా ఉండి కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు జీపీ భవనాల నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలియజేసినారు.  రోడ్డు నిర్మాణములకు, జూనియర్ కళాశాలలకు కూడా నిధులను ప్రభుత్వం దృష్టికి తీసుకోవెల్లి మంజూరు చేస్తామని అన్నారు.  స్వంత స్థలాలలో ఇండ్లు నిర్మించుకొనే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  పట్టణంలో అంబేద్కర్ భవన్ కు ఒక లక్ష, ముదిరాజ్ భవన్ కు ఒక లక్ష చొప్పున మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.  అనంతరం దళిత బంధు లబ్ధిదారులకు కార్లు అందజేశారు.  మహిళా సంఘాలకు రుణాల చెక్కులను కూడా ఈ సందర్బంగా మంత్రి అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు మహేష్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గురునాద్ రెడ్డి, వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ నిఖిల, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్, స్థానిక ఎంపీపీ, మున్సిపల్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు.