ప్రస్తుత పరిస్థితులలో పంట యాజమాన్య పద్ధతులు * కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి ప్రోగ్రాం క

Published: Thursday February 23, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 22, ప్రజాపాలన:
 
ప్రస్తుత పరిస్థితులలో పంట యాజమాన్య పద్ధతుల పై కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్ 
పాలు సలహాలు, సూచనలు చేశారు. బుధవారం ప్రజాపాలన తో మాట్లాడారు. అందులో ముఖ్యంగా...
 
 
వరి:  ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. పురుగు గమనించినట్లయితే నివారణ కోసం కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.4 జి నాలుగు కిలోలు వెయ్యాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి ప్రధాన పొలంలో ఉల్లికోడు ఆశించే అవకాశం కలదు. గమనించినట్లయితే నివారణకు రెండు మిల్లీలీటర్లు కార్బో సల్ఫాన్ లేదా పిప్రోనిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా 10 కిలోల కార్బో ఫ్యూరాన్ 3జి గుళికలు లేదా 6 కిలోల పిప్రొనిల్ 0.3జి లేదా 4 కిలోల పిప్రోనిల్  0.6జి గుళికలు ఎకరానికి వేసుకోవాలి.
 వరిలో అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉన్నందున నివారణ కోసం ట్రై సైక్లోజోల్  0.6 గ్రా లేదా ఐసోప్రోథయోలెన్ 1.5 మి.లి. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
 
 
*వేరుశనగ
 
వేరు శనగలో పొగాకు లద్దెపురుగు సోకుటకు అనుకూలం. పురుగు గమనించినట్లయితే నివారణ కోసం పురుగులు చిన్నగా ఉన్నప్పుడు 0.5శాతం వేప కషాయం లేదా ఐదు మిల్లీలీటర్ వేప నూనె (అజాడిరెటక్టిన్) లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎదిగిన లార్వాను నివారించడానికి 200 మిల్లీలీటర్లు నోవల్యురాన్ లేదా 40 మిల్లీలీటర్ల ఫ్లూబెండియామైడ్ ఒక ఎకరాకు సరిపోయేలా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.   వేరుశనగలో తిక్క ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినట్లయితే నివారణ కోసం రెండు గ్రాముల క్లోరోధాలోనిల్ లేదా 1 గ్రా. టిబ్యుకొనుజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.  వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు గమనించినట్లయితే నివారణ కోసం రెండు గ్రాముల కార్బన్డిజంతో మాంకోజెబ్ ఒక లీటరు నీటికి కలిపి మొక్కల మొదల్లను తడపాలి
 
*జొన్న
 
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో జొన్న పంటలో పేనుబంక పురుగు సోకుటకు అనుకూలం. పురుగు గమనించినట్లయితే నివారణ కోసం రెండు మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా డైమితోయేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
 
*మొక్కజొన్న
 
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మొక్కజొన్న పంటలో కాండం కుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం కాబట్టి నివారణ కోసం 1 గ్రా. కార్బన్డిజం లేదా 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదలు తడిచేలా పిచికారి చేయాలి.
మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ కోసం 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటర్ నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారి చేయాలి.
 
*మామిడి
 
మామిడిలో ప్రస్తుతం తేనెమంచు పురుగు ఆశించుటకు అనుకూలం కాబట్టి నివారణ కోసం పూమొగ్గ దశలో 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరైడ్ లేదా 0.3 గ్రాముల థయోమితాక్సిన్ లేదా 2 మిల్లీలీటర్లు డైమితోయెట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 
*మిరప
 
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో తామర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున నివారణ కోసం ఎసిఫేట్  1.5  గ్రా. లేదా పిప్రొనిల్  2 మి.లి లేదా డైమెతోయేట్ 2 మి. లి. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణ కోసం 2 మిల్లీలీటర్ల డైమితోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని పేర్కొన్నారు.