బత్తినేని ట్రస్ట్ సేవలు ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకోవాలి

Published: Monday January 02, 2023

బోనకల్, జనవరి 1 ప్రజా పాలన ప్రతినిధి: పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడమే బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ ధ్యేయమని బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, నారాయణపురం పిఎసిఎస్ ఛైర్మన్ బత్తినేని నాగప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని బత్తినేని ట్రస్ట్ సౌజన్యంతో అమరజీవి తూము ప్రకాశరావు జ్ఞాపకార్థం మేఘశ్రీ హాస్పిటల్ నందు ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే ప్రత్యేక బిపి, షుగర్ క్యాంపు ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. పేషంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదలకు, మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారిందన్నారు. బిపి, షుగర్ పేషంట్లకు మెరుగైనవైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మండల కేంద్రంలో బిపి, షుగర్ ప్రత్యేక క్యాంపును రూపొందించామని తెలిపారు. మున్ముందు మండలంలోని అన్ని గ్రామాల్లో ట్రస్ట్ సేవలు అందించనున్నారని తెలిపారు. ట్రస్ట్ ద్వారా అందించే వైద్య సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్యాంపులో మేఘశ్రీ హాస్పిటల్ వైద్యులు టి పవనకుమార్, టి ప్రమోద కుమార్, వి సాంబశివరావులు పేషంట్లకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపిడబ్లూఏ టిఎస్ జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు, సిపిఎం నాయకులు షేక్ వజీర్, క్యాంపు నిర్వాహాకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్ నాధ్, కుప్పల నిఖిల్, సిబ్బంది యంగల గిరి, నాగజ్యోతి, గోపి తదితరులు పాల్గొన్నారు.