ట్రస్మా ఆధ్వర్యంలో మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభం

Published: Saturday December 10, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 09, ప్రజాపాలన:  ట్రస్మా మంచిర్యాల పట్టణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మండల స్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రైసింగ్ సన్ పాఠశాలలో ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు, రాష్ట్ర నాయకులు కస్తూరి పద్మ చరణ్, కె ప్రవీణ్ కుమార్ లు పాల్గొని పోటీలను ప్రారంభించారు.అనంతరం  పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ పాష మాట్లాడుతూ కరోనాతో గత రెండున్నర సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైన విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఇందులో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులను సెలెక్ట్ చేసి ట్రస్మా జిల్లా స్థాయి గేమ్స్ కు పంపిస్తామని అన్నారు. కబడ్డీ జూనియర్ విభాగంలో బాలురనుండి 20 పాఠశాలలు, బాలికల నుండి 16 పాఠశాలల వారు పాల్గొంటారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు అనగానే మార్కులు ర్యాంకులు సాధించే యంత్రాలుగా విద్యార్థులను చూస్తారని తప్పుడు ప్రచారం జరుగుతోందని, అది కేవలం కార్పొరేట్ పాఠశాలలో మాత్రమే అని,  ట్రస్మా సంఘంలో కేవలం బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, మా పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా తయారు చేస్తామని అన్నారు. వివిధ పాఠశాలల నుండి ఆటల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో  పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సి.హెచ్. విక్రం రావు, పట్టణ కోశాధికారి జహీరా ఖాతున్, మోహన్ వర్మ, సాదిక్ పాషా, అహ్మద్ ఖాన్, సాదిక్, శేఖర్ మూడో వార్డు కౌన్సిలర్ మజీద్ మరియు వివిధ పాఠశాలల కరస్పాండెంట్ లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.