కేంద్రం ఆరోగ్యాన్ని పట్టించు కోలేదు.

Published: Wednesday February 09, 2022
మంచిర్యాల బ్యూరో, పిబ్రవరి 08, ప్రజాపాలన : కేంద్ర బడ్జెట్ 2022-23లో వైద్య, ఆరోగ్య రంగాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం మొక్కుబడిగా, తాత్కాలిక ఆలోచనతోనే ప్రస్తుత కేటాయింపులు చేసినట్లు అనిపిస్తోందని రైట్ టు హెల్త్ ఫోరమ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అడ్వకేట్ రాజలింగు మోతె అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి స్థాయిలో వైద్య సేవలను అందించే ఏర్పాటు చేయవలసిన తరుణంలో కూడా ఇలాంటి బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరమన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టత, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం, మానసిక ఆరోగ్య కార్యక్రమం, కోవిడ్ నిబంధనలు, పిల్లలకు మహిళలకు ఆరోగ్య సేవలు లాంటి కార్యక్రమాల కోసం తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. ప్రస్తుత బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగం కోసం కేటాయించిన కేటాయింపులు గత ఏడాది సవరించిన అంచనాలకు దాదాపు సమానంగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం దేశ ఆరోగ్యాన్ని పోషకాహారాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ కేటాయింపులన్నీ కార్పొరేట్ కంపెనీల కోసమేనని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుమ్మల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, నాయకులు కర్ణ కంటి రవీందర్, జంబోజి శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.