కూలిపోయే ఇండ్లల్లో నివసించరాదు పునరావాస కేంద్రాలుగా జిపి అంగన్వాడి పాఠశాలలో వసతులు డప్పు

Published: Wednesday July 27, 2022
వికారాబాద్ బ్యూరో 26 జూలై ప్రజాపాలన : సోమవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుండపోత వర్షాలతో కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లను ఖాళీ చేయాలని పలుమార్లు సూచిస్తున్న సర్పంచ్. గ్రామంలో డప్పు చాటింపు చేయించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాములు నాయక్ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ వార్డ్ మెంబర్స్ తో కలిసి వీధి వీధి తిరుగుతూ భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కూలిపోయే ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను ఖాళీ చేసి ఏర్పాటుచేసిన ఆవాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎల్లకొండ బుచ్చమ్మ వడ్డే చంద్రయ్య వడ్డే దశరథ్ వడ్డే బుచ్చయ్య కొన ఇంటి బీరప్ప మంగలి శంకరమ్మల బండల ఇల్లు కూలిపోయే స్థితిలో ఉన్నాయని హెచ్చరించారు. వెంటనే ఈ ఇండ్లను ఖాళీ చేసి మేము ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ అంగన్వాడీ భవనము పాఠశాలలో నివాసం ఉండాలని హితవు పలికారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత యధావిధిగా మీ ఇండ్లకు వెళ్లిపోవచ్చని కోరారు. ప్రజల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే తమ ఇండ్లను ఖాళీ చేసి ఆవాస కేంద్రాలకు రావాలని తెలిపారు. ఆవాస కేంద్రాలలో తాగునీరు ఆహారం అందజేస్తామని భరోసా కల్పించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షం రానున్నదని వాతావరణ శాఖ హెచ్చరించిందని గుర్తు చేశారు. గ్రామ ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావించి అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నామని అన్నారు. వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా భద్రతా చర్యలను పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ప్రజలు తమ ప్రయాణాలు కొనసాగించరాదని హితవు పలికారు ఇంటిల్లిపాది రక్షణగా ఉన్న ఇండ్లలోనే ఉండాలని పదేపదే చెబుతున్నారు.