"బెజ్జూర్ రిపోర్టర్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి"

Published: Monday January 10, 2022
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 09 (ప్రజాపాలన) : జిల్లాలోని కాగజ్ నగర్ పరిధిలోగల బెజ్జూర్ మండలం సాక్షి విలేకరి మహేష్ పై అటవీశాఖ అధికారులు ఇటీవల పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ల సంఘం కే బీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ సురేందర్ రావులు డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు సంయుక్తంగా కలిసి డీఎస్పీ కరుణాకర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జూర్ మండలంలో జరుగుతున్న అక్రమ కలప రవాణా విషయంలో మహేష్ అనేక సార్లు సాక్షి దినపత్రికలో వార్తలు రాశారు. దీంతో అటవీ శాఖ అధికారి మా పైననే వార్తలు రాస్తావా నీ పైన కేసులు బనా యిస్తా అంటూ విలేకరి మహేష్ ను ఫోన్ లో బెదిరించారు. ప్రస్తుతం అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన సంఘటనపై వార్త కవరింగ్ కోసం వెళ్ళిన సాక్షి విలేకరి మహేష్ పై కక్షతో అటవీశాఖ అధికారులు అక్రమ కేసు బనాయించారని దీన్ని తీవ్రంగా ఖండించారు. వార్తలు రాస్తే కక్షతో కుట్రలు పన్ని జర్నలిస్టులపై అక్రమ కేసు పెట్టడం పత్రికాస్వేచ్చను హరించడమే అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి వెంటనే పై పెట్టిన అక్రమ కేసును ఎత్తి వేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి దినపత్రిక ఆర్సి ఇంచార్జ్ ఇసాక్, పాత్రికేయులు శ్రీశైలం, గంధం శ్రీనివాస్, షఫీ ఉల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు.