కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం

Published: Thursday July 22, 2021
వికారాబాద్ 21 జూలై ప్రజాపాలన బ్యూరో : నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే పక్కా ప్రణాళిక అవసరం. ఎన్ని అవాంతరాలు ఎదురైన ఎదురీదాలనే దృఢ సంకల్పం ఉండాలి. లక్ష్యాన్ని ఛేదిస్తాననే ఆత్మవిశ్వాసంతో కృషి చేయాలి. ఉదాహరణకు చెట్టుమీద నీకేమి కనిపిస్తుంది అర్జునా అని ద్రోణాచార్యుడు అడిగిన ప్రశ్నకు నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందని సమాధానం ఇచ్చాడు. అలాగే  కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చేరుకునే వరకు పక్కకు దృష్టి సారించనని భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవాలి. అందుకు అనుగుణంగా తన వంశ పారంపర్య రాజకీయ వారసత్వం మార్గదర్శనం అత్యంతావశ్యకం. ఆ కోవలోని వ్యక్తే ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి. జిల్లాలో గల వికారాబాద్ నియోజక పరిధిలోని ధారూర్ మండలానికి చెందిన అంతారం గ్రామ వాసి. పట్లోళ్ళ తులసమ్మ పట్లోళ్ళ నర్సిరెడ్డి పుణ్యదంపతులకు రెండవ సంతానం. పట్లోళ్ళ నర్సిరెడ్డి అంతారం గ్రామానికి ప్రస్తుతం సర్పంచుగా కొనసాగుతున్నాడు. తన తాత పట్లోళ్ళ అంజిరెడ్డి పోలీస్ పటేల్ గా ఉంటూ ప్రజలతో మమేకమైన తీరును తెలుసుకున్నాడు. తన కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడంతో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి చురుకైన పాత్ర పోషించాలనుకున్నాడు. ప్రజా సేవే పరమావధిగా భావించి 2000 సంవత్సరంలో రాజకీయ అరంగ్రేటం చేశాడు.  విద్యార్థి దశ నుండే రాజకీయాలలో అమితాసక్తి కనబర్చారు. రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి ధారూర్ మండలంలోనే పార్టీలో చురుకైన యువకుడిగా అధినాయకత్వం దృష్టిలో పడ్డాడు. శ్రమకు తగ్గ ఫలితంగా 2003వ సంవత్సరంలో ధారూర్ మండల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. ఎన్నికల్లో అనుభవలేమి కారణంగా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. నిరుత్సాహం చెందకుండా నిరంతర శ్రమతో మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ విలువైన సూచనలు సలహాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. 2005 నుండి 2013 వరకు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ పదవిని చేపట్టారు. ధారూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో 2013లో మండల అధ్యక్షునిగా నియామకం జరిగింది. ధారూర్ మండల అధ్యక్షునిగా నియామకం అయినప్పటి నుండి జరిగిన అన్ని ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాడు. 8 మంది ఎంపిటిసిలు, ఒకరు జడ్పీటీసీ, 19మంది సర్పంచులను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఎంఎల్ఏ, ఎంపి ఎన్నికల్లో ఓటమి చెందిన జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ అందించాడు. 2018లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా అవకాశం వస్తుందని ఆశించిన అనివార్య కారణాల వలన రాలేదు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో బలమైన అధికార టిఆర్ఎస్ పార్టీ చేతిలో 76 ఓట్ల తేడాతో పట్లోళ్ళ తులసమ్మ ఓటమి చెందారు. 5 మంది ఎంపిటిసిలు గెలిపించడంలో తన వంతు పాత్రను పోషించారు. మల్కాజిగిరి ఎంపి ఎనుముల రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షునిగా నియామకం అయితే ధారూర్ మండల కేంద్రం నుండి శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపడుతానని మొక్కుకున్నాడు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ లు టిపిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని నియమించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షునిగా ప్రకటించడంతో విజయ సంకల్ప్ పాదయాత్ర చేపట్టాను. విజయ సంకల్ప్ పాదయాత్రలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రమేష్ మహరాజ్ లు పాల్గొనడంతో సంపూర్ణ విజయవంతం అయ్యింది. పాదయాత్ర విజయవంతం అవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వచ్చింది. ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అధినాయకత్వం జిల్లా స్థాయిలో నా సేవలు కావాలని ఆశిస్తే తప్పకుండా నిర్వహిస్తాను. నా లక్ష్యం అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని ఉంది.