గొర్రెలు, మేకలకు నట్టల నివారణ

Published: Thursday February 23, 2023
*  జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అనిల్ కుమార్
వికారాబాద్ బ్యూరో 22 ఫిబ్రవరి ప్రజాపాలన : జిల్లాలోని గొర్రెలు, మేకలలో నట్టల నివారణ కార్యక్రమాన్ని 22 ఫిబ్రవరి 2023 బుధవారం నుండి 28 ఫిబ్రవరి 2023 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలో  రెండవ విడత 2022-23 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు "గొర్రెలలో, మేకలలో నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.  గ్రామాలు, మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం జరిగినదని అన్నారు.  కార్యాచరణ ప్రణాళిక ప్రకారము జిల్లాలో ఉన్న 20 మండలాలలోని పశువైద్య సిబ్బందిని 56 బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. మండల పశువైద్యఆధికారి ఆధ్వర్యంలో నిర్ణయించిన తేదీలలో అన్ని మండలాలలోని గ్రామాలకు వెళ్లాలని సూచించారు. గ్రామాల్లోని గొర్రెలు, మేకల పెంపకం దారులకు ముందస్తుగా సమాచారం అందించాలన్నారు. గ్రామములోని గొర్రెలు, మేకలన్నింటికి ఉచిత నట్టల నివారణ మందులు త్రాగించడం జరుగుతుందన్నారు.   జిల్లాలోని 2,54,581   గొర్రెలు, 2,59,534 మేకలలో ఉచితంగా  నట్టల నివారణ మందులు త్రాగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమము వలన గొర్రెలలో మరియు మేకలలోని నట్టలు  నివారింపబడి, 2 - 3  కిలోల బరువు అదనంగా పెరుగుతాయని భరోసా కల్పించారు. వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయన్నారు. పునరుత్పత్తి శక్తి పెరిగి వాటి పిల్లలు ఆరోగ్యంగా పుడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రకంగా గొర్రెలు మేకల పెంపకదారులు అధిక ఆదాయం పొందగలుగుతారని తెలిపారు.
జిల్లాలోని గొర్రెలు, మేకల పెంపకదారులందరు పశువైద్య సిబ్బందికి సహకరించి ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్దికంగా లాభపడాలని జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక అధికారి, డా: పి. అనిల్ కుమార్ కోరారు.