దళిత యువతికి పోలీసులు న్యాయం చేయాలి తెలంగాణ నేతకాని మహార్ సంఘం నాయకుల డిమాండ్

Published: Wednesday September 14, 2022

బెల్లంపల్లి సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తికి చెందిన దళిత ( నేతకాని) యువతిని, సోమగూడెం ఉపసర్పంచ్ అరెపల్లి ప్రవీణ్ పది సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని జరిగిన సంఘటనను ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తెలంగాణ నేతకాని మహార్ కుల సంఘం నాయకులు ఆరోపించారు.

మంగళవారం స్థానిక బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ఎస్సీ నేతకాని సామాజిక వర్గానికి చెందిన దళిత యువతిని, ఒక బిసి సామాజిక వర్గానికి చెందిన అరెపల్లి ప్రవీణ్ అనే యువకుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉపసర్పంచ్ హోదాలో ఉండి ప్రజల బాగోగులను చూడాల్సింది పోయి, యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కట్నం కింద రూ.25 లక్షల తీసుకుని పెళ్లి కార్డుల వరకు తీసుకువచ్చి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని, ఈ విషయమై పది రోజుల క్రితం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోను, బెల్లంపల్లి ఏసిపి కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ప్రవీణ్ పై ఎలాంటి చర్యలు తీసుకో లేదని, కనీసం పిలిపించి మాట్లాడలేదని అన్నారు. ప్రవీణ్ బిసి కులానికి చెందినవాడు కాగా ఏసిపి కూడా బిసి కులానికి చెందినవారు కావడంతో కేసును పట్టించుకోకుండా వారికి అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు, ఇప్పటికైనా పోలీసు అధికారులు ఈ కేసు పై దృష్టి సారించి యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

లేనిచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతకాని మాహార్ కుల సంఘం తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడ తామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మహార్ కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాలి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి గోమాస రాజం, గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ కలాలి భీమయ్య, మండల అధ్యక్షుడు చదువుల వెంకటరమణ, నాయకులు దుర్గం రాజేశ్వర్, , గోమాస జువ్వాజి, దుర్గం భానుప్రసాద్, గోమాస వినోద్ కుమార్, చల్లూరి రామకృష్ణ, గంధం లింగయ్య, రామటెంకి చంద్రశేఖర్, గోమాస క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

ఏసీపి మీద చేసిన ఆరోపణల విషయమై, ఫోన్లో వివరణ కోసం ప్రయత్నించగా ఏసిపి అందుబాటులోకి రాలేదు.