బూచన్పల్లి గ్రామాభివృద్ధే లక్ష్యం : సర్పంచ్ జయ దయాకర్

Published: Thursday January 20, 2022
వికారాబాద్ బ్యూరో 19 జనవరి ప్రజాపాలన : గ్రామాభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని బూచన్పల్లి గ్రామ సర్పంచ్ జయదయాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను తెలుసుకొనుటకు ప్రతి రోజు వార్డుకు ఒకటి చొప్పున తిరిగి సమస్యలను తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. రోజు విడిచి రోజు మురికి కాలువలను శుభ్రం చేయిస్తున్నామని వివరించారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులతో మురికి చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలనే లక్ష్యం ఉందన్నారు. మురికి కాలువలు లేని వార్డులో మురికి కాలువల నిర్మాణం చేపడుతామని చెప్పారు. గ్రామంలో మురుగు కాలువల నిర్మాణం ఆవశ్యకత ఉందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. అందులో భాగంగానే మురుగు కాలువల నిర్మాణానికి 3 లక్షల రూపాయల అంచనా వ్యయ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు అందజేశామని ఉద్ఘాటించారు. బూచన్ పల్లి గ్రామానికి చెందిన కార్తీక్ కు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సిఎం సహాయ నిధి 32 వేల రూపాయల చెక్కును లబ్దిదారునికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయిని మధు ముదిరాజ్, రైతు బంధు అధ్యక్షుడు నాయబ్ గౌడ్, మండల టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.