ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Published: Tuesday February 15, 2022
జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రజల నుండి వచ్చే భూ సమస్యలపై ధరణిలో ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో తహసీల్దార్లతో కలసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి సమస్యలకు మండల పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడి కక్కడే పూర్తి బాధ్యతతో పరిష్కరించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఏ చిన్న సమస్యకైనా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళండి అని ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పంపకుండా, ధరణి సమస్యను ముందుగా తహసీల్దార్లు అర్థం చేసుకొని సాధ్యమైతే అట్టి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలని, లేదా వారికి తగు సలహాలు సూచనలు అందజేసి సహకరించాలన్నారు.  అర్థం కాని ధరణి సమస్యలకు టెక్నికల్ టీమ్ లకు కాల్ చేసి సమస్యను పరిష్కరించే దిశగా తహసీల్దార్లు కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యల పట్ల మండల స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుండి ధరణి సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లతో పాటు ఆర్డిఓ లు కూడా తప్పకుండా పాల్గొనాలని సూచించారు. ధరణి సమస్యల పరిష్కారంలో భాగంగా ఈరోజు ప్రజల నుండి (90) ఫిర్యాదులు స్వీకరించి, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. మిగితా సనస్యలను తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ప్రజలకు అందించి వారికి సహకరించాలని కలెక్టర్ తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, కలెక్టర్ కార్యాలయ ఏఓ హరిత, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.