ఆదర్శ ఉపాధ్యాయుడు ఎంపిడిఓ సత్తయ్య

Published: Tuesday September 06, 2022
పంచాయతీ కార్యదర్శి బండ కిషన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజా పాలన : ఎందరో విద్యార్థులను తన బోధనా నైపుణ్యంతో తీర్చిదిద్దిన ఆదర్శ ఉపాధ్యాయుడు ఎంపిడిఓ సత్తయ్య అని అత్వెల్లి పంచాయతీ కార్యదర్శి బండ కిషన్ రెడ్డి కొనియాడారు. సోమవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిడిఓ పదవి చేపట్టకముందు గణిత శాస్త్ర బోధకునిగా ఎందరో విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తిని కలిగించే వారని గుర్తు చేశారు. ఎంతటి జఠిల గణిత సమస్యనైనా ఆలోచన స్ఫూర్తిని కలిగించే విధంగా గణిత సమస్యను పరిష్కరించడంలో దిట్ట అని ప్రశంసించారు. గతంలో గణితం బోధించే వారైనా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎంపీడీవో పదవిని చేపట్టారని స్పష్టం చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని కర్తవ్యాన్ని విధులను సమయపాలనను ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయని గొప్ప వ్యక్తి ఎంపీడీవో సత్తయ్య అని గుర్తు చేశారు. తన తోటి సిబ్బందితో సమన్వయంతో వ్యవహరించి పనులను చక్కబెట్టుకోవడంలో తగు నేర్పరి కల వ్యక్తి అని కీర్తించారు. పేరుకు అధికారి అయినా తోటి సిబ్బందితో కలగల్సి చాకచక్యంగా పనులు చేయించుకోవడంలో ఎంపీడీవో సత్తయ్య సార్ ని మించిన వ్యక్తి మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. గురుతుల్యులైన సత్తయ్య సార్ ను సన్మానించడం పూర్వజన్మ సుకృతం అన్నారు.