సోనియా గాంధీ ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుదాం : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

Published: Tuesday December 14, 2021
వికారాబాద్ బ్యూరో 13 డిసెంబర్ ప్రజాపాలన : సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, డిసిసి అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి ల సమక్షంలో మోమిన్పేట్ మండలానికి చెందిన టిఆర్ఎస్, టిడిపి, వైసిపి పార్టీలకు చెందిన కార్యకర్తలు హస్తం గూటికి చేరారు. మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా కల్పించారు. వివిధ పార్టీల నుండి వచ్చి చేరిన ఏ కార్యకర్తను చిన్నచూపు చూడమని హామీ ఇచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం పని చేసే కార్యకర్తలకు పార్టీ పదవులు కూడా ఇస్తామని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి వివరించాలని సూచించారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని సిఎం కేసిఆర్ చెప్పిన మాటలు వట్టి బూటకమని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని దెప్పిపొడిచారు. భూ కబ్జాలు, ఎర్ర మట్టి గుట్టలు, రాళ్ళ గుట్టలు టిఆర్ఎస్ పాలనలో కనుమరుగయ్యాయని విమర్శించారు. 90 శాతం మైనారిటీలు కష్టాల ఊబిలో కూరుకపోయారని చెప్పారు. మోమిన్పేట్ మండలం నుండి కనీసం 1000 ఓట్లు ఆధిక్యత ఇస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు కల్ఖోడ నర్సిములు పార్టీ నియమాలకు కట్టుబడి పని చేస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పిఏసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి, జడ్పిటిసి మాజీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, సిరాజ్, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, మోమిన్పేట్ మండల అధ్యక్షుడు శంకర్,  తదితరులు పాల్గొన్నారు.