ఎజెండాలకే పరిమితమైన 10వ వార్డు

Published: Monday October 11, 2021
వికారాబాద్ బ్యూరో 10 అక్టోబర్ ప్రజాపాలన : వికారాబాద్ మున్సిపల్ పట్టణ అభివృద్ధికి మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ సమ దృష్టితో చూడాల్సిన బాధ్యత మరువలేనిది. పట్టణ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతివార్డు అభివృద్ధిపై మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ లు అభివృద్ధికి నోచుకోని వార్డులను ముందుగా గుర్తించి ఎజెండాలో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. పాలకవర్గం దృష్టిలో కొన్ని వార్డులు లేనట్లుగా ఉన్నాయని 10వ వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టి సెప్టెంబర్ మాసాంతం వరకు 21 నెలల కాలం గడిచింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో చెంచుపల్లి, లక్ష్మీనగర్ తండా, బలిజగూడెం, గిరిగెట్ పల్లిలో కొంత భాగం, అనంతగిరిపల్లి లు ఉన్నాయి. 10వ వార్డు కౌన్సిలర్ గా అంగోత్ దేవి రెడ్యానాయక్ కొనసాగుతున్నారు. 10వ వార్డు అభివృద్ధి కొరకు మూడు సార్లు ఎజెండాకు నోచుకుంది. మొదటి సారి ఎజెండాలో 5 లక్షల నిధులతో అనంతగిరిపల్లిలో సిసి రోడ్ల నిర్మాణానికి టెండర్ ప్రకటించారు. టెండర్ ను కాంట్రాక్టర్ చింతకింది ప్రశాంత్ దక్కించుకున్నాడు. ఇంత వరకు సిసి రోడ్డు నిర్మాణం జాడ లేదని కౌన్సిలర్ అంగోత్ దేవి రెడ్యానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండవ సారి ఎజెండాలో 3 లక్షల నిధులు, మూడవ సారి ఎజెండాలో 10 లక్షల నిధులు కేటాయించారు. కానీ, టెండర్ ప్రకటించలేదని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరిపల్లి, గిరిగెట్ పల్లిలో సిసి రోడ్ల నిర్మాణపు పనులు చేపట్టుటకు చైర్ పర్సన్ కు మనసు కరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 10వ వార్డుపై చైర్ పర్సన్ సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని కౌన్సిలర్ అంగోత్ దేవి రెడ్యానాయక్ విమర్శించారు. 10వ వార్డుపై చైర్ పర్సన్ కు, కమీషనర్ కు ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నించారు. ఇకనైనా సవతి తల్లి ప్రేమను చూపకుండా కన్నతల్లి ప్రేమను చూపి 10వ వార్డు అభివృద్ధికి తోడ్పడాలని కౌన్సిలర్, వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 10వ వార్డు అభివృద్ధికి చైర్ పర్సన్, కమీషనర్ లు ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిద్దాం.