కనీస సౌకర్యాలు కల్పించాలని సబ్బని కృష్ణ నిరాహారదీక్ష

Published: Saturday May 15, 2021

బెల్లంపల్లి మే 14 ప్రజా పాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని ప్రైవేట్ ఆస్పత్రులను జాతీయం చేయాలని ప్రభుత్వ ఆస్పత్రులలో బెడ్ల, ఆక్సిజన్, వైద్య నిపుణుల కొరత లేకుండా చూడాలని ఎం సి పి ఐ యూ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ అన్నారు. బెల్లంపల్లి పట్టణం లోని తన స్వగృహంలో శుక్రవారం నాడు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని ప్రైవేటు ఆసుపత్రులను జాతీయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల ఆక్సిజన్  వైద్య నిపుణుల కొరత లేకుండా చూడాలని వెంటనే ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు, అలాగే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వలస కూలీలకు అసంఘటిత కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని, సింగరేణిలో లాక్ డౌన్ ప్రకటించి కార్మికులు కరోనా బారిన పడకుండా కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, కరోనా మూడవ విడత కూడా వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిపుణులు చెబుతున్న పాలకులకు చీమకుట్టినట్టు లేదని, ముందు జాగ్రత్తగా తగు ఏర్పాట్లు చేయటం లేదని అన్నారు, ప్రైవేటు ఆస్పత్రుల వాళ్లు లక్షలాది రూపాయల బిల్లులు వేస్తూ ప్రజలు ఆస్తులు అమ్ముకొని అప్పులపాలవుతున్న, సరైన వైద్యం అందక చనిపోతున్నా,  ముఖ్యమంత్రి  ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఏ ఒక్క రోజు కూడా సందర్శించకపోవడం చాలా వింతగా, విడ్డూరంగా ఉందని అన్నారు. చనిపోయిన వారిని ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు పూడ్చడానికి  కాల్చడానికి సరైన వసతులు  సౌకర్యాలు స్థలాలు స్మశాన వాటికలు లేక నదులలో శవాలను మూటలుగట్టి పడేస్తున్న దృశ్యాలను చూస్తుంటే హృదయం ద్రవిస్తుందని, పాలకులకు మాత్రం కనువిప్పు కలగడంలేదని, ఇప్పటికైనా వెంటనే యుద్ధ ప్రాతిపదికన కరోనా పోయేంతవరకు ప్రజల ప్రాణాలతో శవాలతో వ్యాపారం చేస్తున్న  ప్రైవేట్ ఆస్పత్రులను జాతీయం చేయాలని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించాలని, సింగరేణిలో లాక్ డౌన్ ప్రకటించాలని, వలస కూలీలలకు, అసంఘటిత కూలీలకు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు సరిపడు నిత్యవసర వస్తువులతో పాటు నెలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని, ప్రజల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పి ఎం సి పి ఐ యు పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.