పరిమితికి మించి రసాయనాలు వాడరాదు

Published: Wednesday February 15, 2023
* వ్యవసాయ విస్తరణ అధికారి జి అనిల్ కుమార్
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : రైతులు పండించే పంటలకు పరిమితికి మించి రసాయనాలు వాడరాదని వికారాబాద్ వ్యవసాయ విస్తరణ అధికారి జి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని కొత్తగడి క్లస్టర్ నారాయణపూర్ రైతు వేదికలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేస్తూ రైతు సమస్యలను చైతన్యంతో పరిష్కరించడానికి వికారాబాద్ జిల్లాలోని ఎఫ్ పిఓ, సీఈఓలు,  బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చుట్టుపక్కల గ్రామాల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి సహకారంతో సుస్థిర వ్యవసాయ కేంద్రం వారు, పిఓపిఐ నుంచి స్వచ్ఛంద సీడ్ సమస్త శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి జి అనిల్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేల, నీటి యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన కల్పించామన్నారు. మితిమీరిన ఎరువులు, పురుగు మందులు వాడకంతో మన దగ్గర పండించే పండ్లు కాయగూరలు బియ్యము పాలు ఒకటేమిటి ఏ  ఆహారపదార్థము ముట్టుకున్న పరిమితికి మించి రసాయనాలు ఉంటున్నాయని స్పష్టం చేశారు. ఒకవైపు రసాయనాలతో భూమి, నీరు కలుషితమవుతుంటే మరోవైపు మనుషుల్లో పశువుల్లో కోళ్లలో కణము కణము విషపూరితమై మానవాళిని పట్టిపీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులు తేలికగా పశువుల పేడ, చుట్టుపక్కల లభించే మొక్కల కషాయాలతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఎరువులు పురుగు మందులు తయారు చేసుకొని అమృత తుల్యమైన ఆహారాన్ని పండించవచ్చని వివరించారు. కింది పద్ధతులు పాటిస్తే నేల, నీటిని కలుషితం నుండి సంరక్షించుకోవచ్చు.1) వర్షాధారిత ప్రాంతాలలో నేల, నీటి సంరక్షణ పద్ధతులు.
2) వ్యవసాయంలో చేదోడుకునీటి కుంటల నిర్మాణము. 3) చిన్న చెక్ డ్యామ్ లతో వర్షపు నీటి సంరక్షణ. 4) బావులలో నీటిమట్టం పెంపుకు రీఛార్జి ఫిల్టర్స్. 5) నీరు, భూమి సంరక్షణలో గడ్డి ఇతర మొక్కల పెంపకం. 6) ప్రకృతి వ్యవసాయంలో పంట, నేల యాజమాన్యం.