*సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి* *షాబాద్ సీఐ గురువయ్యగౌడ్*

Published: Monday December 19, 2022
 *సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మీరు సైబర్ నేరగాళ్ల మాయ మాటలను నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. దీనికి కారణం కేవలం మీకు సైబర్ నేరాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే అని షాబాద్ సీఐ గోప గాని గురువయ్య గౌడ్ అన్నారు, షాబాద్ లో ప్రజలకి సైబర్ నేరాల పైన అవగాహన మీటింగ్ నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా మీ విలువైన డబ్బుని కాపాడుకోండి అని అన్నారు.
 
అపరిచిత వ్యక్తులు ఎవరు అడిగినా ఎట్టిపరిస్థితుల్లోనూ OTP చెప్పకూడదు.
 
మీ మొబైల్ కి వచ్చే మెసేజిలలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు మరియు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదు.
 
మీకు బహుమతి లేదా లాటరీ వచ్చింది ముందుగా కొంత డబ్బులు చెల్లించండి అంటే అత్యాశకు పోయి ఎవరి ఖాతాలో డబ్బులు వేయరాదు. కస్టమర్ కేర్ నెంబర్లను సంబంధిత వెబ్సైట్ నందు వెతకండి.
 
బ్యాంకు అకౌంట్ KYC అప్ డేట్ చేయాలంటూ ఫోన్ చేసి Any Desk, QuickSupport వంటి రిమోట్ ఆప్ లను డౌన్లోడ్ చేసుకోమని అంటే చేయకండి అలా చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఖాతా లో ఉన్న మొత్తం డబ్బును కాజేస్తారు.
 
ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారా. మీరు జాబ్ కి సెలెక్ట్ అయ్యారని చెప్పి, ముందుగా ఫార్మాలిటీస్ కోసం కొన్ని డబ్బులు కట్టాలని అడిగితే అది మోసమని గ్రహించండి. గుర్తుంచుకోండి మీకు ఉద్యోగం ఇచ్చేవారు మిమ్మల్ని డబ్బులు అడగరు.
 
ఆన్లైన్లో మీ డబ్బులు పెట్టుబడిగా పెడితే తక్కువ సమయంలోనే రెండింతలు, మూడింతలు అవుతాయని చెపితే అది మోసమని గ్రహించండి.
 
అపరిచిత వ్యక్తులు పంపిన QR కోడ్ స్కాన్ చేయకండి. QR కోడ్ స్కాన్ చేయడమంటే డబ్బులు మీ ఖాతాలో నుండి పంపడం, అంతేగాని డబ్బులు మీ ఖాతాలోకి రావడం కాదు.
 
వివాహ సంబంధ వెబ్సైట్లలో పరిచయం అయిన అపరిచిత వ్యక్తులను నమ్మకండి. వాళ్ళు మీకు విలువైన బహుమతులు పంపిస్తున్నాము అంటే మోసమని గ్రహించండి.
 
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో అనగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మొదలైన వాటిలో అపరిచితుల నుండి వచ్చే స్నేహితుల అభ్యర్థనలను అంగీకరించవద్దు మరియు మెసెంజర్లలో (వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైనవి) అపరిచితులతో చాట్ చేయవద్దు. మోసగాళ్లు మీ ఫోటోలను మరియు వీడియోలను రికార్డ్ చేస్తారు మరియు వాటిని నగ్నంగా మార్ఫింగ్ చేసి మీ స్నేహితులకి, బంధువులకి పంపిస్తామని చెప్పి డబ్బులకోసం మిమ్మల్ని బెదిరిస్తారు