కారుణ్య నియామక పత్రాల అందజేత.

Published: Friday January 21, 2022
నస్పూర్, జనవరి 20, ప్రజాపాలన ప్రతినిధి : కారుణ్య నియామకాలలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో నియామకం పొందిన యువతి, యువకులకు ఏరియా జనరల్ మేనేజర్ యం.సురేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. గురువారం జీఎం కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకాలు పొందిన 66 మంది యువతి, యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని, దక్షిణ భారతదేశంలోనే సింగరేణి సంస్థ దేశానికే తలమానికంగా ఉందని అన్నారు. యువత గైర్హాజరు కాకుండా క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉద్యోగాలు పొందిన కార్మికుల వారసులు కష్టపడి పని చేస్తూ సింగరేణి సంస్థకు అధిక లాభాలు తేవాలని కోరారు. అదే విధంగా వారి తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవాలని సూచించారు. సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దిశానిర్దేశంలో సింగరేణి సంస్థ ప్రగతిపథంలో వెళ్తుందని దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని కోరారు. ఉద్యోగంలో నైపుణ్యాన్ని పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సీనియర్ ఉద్యోగుల సలహాలు సూచనలు తీసుకుని ప్రమాద రహిత సింగరేణిగా శ్రీరాంపూర్ ఏరియాకు పేరుతేవాలని కోరారు. కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటివరకు శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో 2314 కారుణ్య నియామక పత్రాలను జారీ చేయడం జరిగిందని సింగరేణి వ్యాప్తంగా 7774 కారుణ్య నియామక పత్రాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం గుప్తా, డీజీఎం నికోలస్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రాఘవేంద్రరావు, ఏరియా ఇంజనీర్ కుమార్, ఏజీఎం ఫైనాన్స్ మురళిధర్, డిప్యుటీ పీఎం సుధర్శన్, సీనియర్ పివో లు రాజేశ్, శ్రీ కాంతారావు, ప్రకాష్, జిఎం ఆఫీసు పిట్ సెక్రెటరీ పీవీ రావు పాల్గొన్నారు.