వేలాల జాతర ఏర్పాట్లు పకడ్బంధీగా నిర్వహించాలి. రాజస్వ మండల అధికారి వేణు

Published: Saturday February 11, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 10, ప్రజాపాలన  :
 
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని జైపూర్ మండలంలో ఈ నెల 18, 19, 20 తేదీలలో నిర్వహించే వేలాల జాతర ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బంధీగా నిర్వహించాలని రాజస్వ మండల అధికారి వేణు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్.డి.ఓ. కార్యాలయంలో వేలాల జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ వేలాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మండల తహశిల్దార్ ఏర్పాట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మౌళిక ఏర్పాట్లు చేయాలని, వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులతో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. జాతరలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయాలని, విద్యుద్దీపాలు, గోదావరి పుష్కరఘాట్లలో పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వేలాల జాతరకు వెళ్ళేందుకు వివిధ ప్రాంతాల నుండి అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ కొరకు అగ్నిమాపక యంత్రాలతో సిద్ధంగా ఉండాలని, మత్సశాఖ ఆధ్వర్యంలో గోదావరి తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జాతర కోసం వచ్చే భక్తుల కొరకు గోదావరి తీరంలో త్రాగునీరు, మూత్రశాలలు, తాత్కాలిక స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లతో జాతర విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈ.ఓ. రమేష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.