ఆధార్ నమోదు ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలి

Published: Wednesday January 18, 2023
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 17 జనవరి ప్రజా పాలన : జిల్లాలోని ఉపాధి హామీ కూలీల ఆధార్ సేకరణ మరియు నమోదు పనులను మూడు రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డి ఆర్ డి ఓ కృష్ణన్ లతో కలిసి ఉపాధి హామీ కూలీల ఆధార్ నమోదు మరియు పెండింగ్ సోషల్ ఆడిట్ పేరాల పనులపై పనులపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ కూలీల ఆధార్ సేకరణ మరియు ఆన్లైన్ లో నమోదు ప్రక్రియను వేగవంతం చేసి మూడు రోజులలో పూర్తి చేయాలని సూచించారు.  ఎంపీడీవోల ఆధ్వర్యంలో రాత్రి పగలు నిర్విరామంగా సంబంధిత ఆపరేటర్లు, టి ఏ లు, ఈసీలు, ఇతర టెక్నికల్ సిబ్బందితో పనులను యుద్ధ ప్రాతిపదికన  పూర్తి చేయాలన్నారు.  అలాగే మండలాల వారిగా సోషల్ ఆడిట్ పెండింగ్ పేరాలను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 1216 సోషల్ ఆడిట్ పేరాలు పెండింగ్ లో ఉన్నాయని వారం రోజులలో ఇట్టి పేరాలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు , ఏపీవోలు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.