ప్రపంచంలోనే అద్భుత పథకం రైతు బంధు

Published: Wednesday January 12, 2022
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 10 (ప్రజాపాలన) : ప్రపంచం లోనే అద్భుత పథకం రైతుబంధు అని జిల్లా జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. సోమవారం నాటికి టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతల ఖాతాలలో జమ చేసిన మొత్తం రూ 50 వేల కోట్లు దాటిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఎడ్ల బండి, ట్రాక్టర్ ల తో భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్ పర్సన్ కోవా లక్ష్మీ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ద్వంద్వ విధానాలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలో పల్లెలు ఆర్థిక పరిపుష్టి సాధించాయన్నారు. రైతు పథకం మొదలైన దగ్గర నుంచి  అన్నదాతలకు వానాకాలం, యాసంగి పంట కు ఆర్థిక సహాయం అందుతూనే ఉన్నాయని తెలిపారు. రైతుకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, అందుబాటు లో ఎరువులు, విత్తనాలు, ఉంచడంతో పాటు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారని అన్నారు. రైతులంతా ఒక దగ్గర కలుసుకుని చర్చించడం కోసం ట్రాక్టర్ ల వారీగా రైతు వేదికలను నిర్మించారని తెలిపారు. దేశములో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాదేవేని మల్లేష్, సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ మహమ్మద్, పార్టీ అధ్యక్షుడు గంధం శ్రీనివాస్, బాలేష్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.