దోపిడి వ్యవస్థను ప్రశ్నించేది కమ్యూనిస్టులే

Published: Tuesday June 21, 2022
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహరావు
 
బోనకల్, జూన్ 20 ప్రజా పాలన ప్రతినిధి: దోపిడిదారులను, దోపిడి వ్యవస్థను ప్రశ్నించేది, పోరాడేది ఒక్క కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహరావు అన్నారు. మండలంలోని కలకోట గ్రామ శాఖ సిపిఐ మహాసభ సోమవారం నిర్వహించారు. ముందుగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు బెజవాడ రవిబాబు జెండా ఆవిష్కరణ చేశారు. మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన సింగు నరసింహరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశం మొత్తం దోపిదడికి గురవుతుందని, పేదల రక్తమాంసాలు వడ్డీ పన్నుల రూపంలో కట్టిన ప్రజాసొమ్మును కార్పోరేట్ శక్తులకు మోడీ ధారపోస్తున్నారన్నారు. మొన్న జరిగిన ఆగ్నిపథ్ అలర్లలో చాలా మంది మేధావులు ప్రజాసొమ్మును నష్టపరిచారని కూనీరాగాలు తీస్తున్నారన్నారు.అయినప్పటికీ పెద్దపెద్ద నవరత్న, మహారత్న లాంటి లాభాలు ఉన్న ప్రజా ఆస్తులను మోడీ అత్యంత తక్కువ ధరకు మోడీ విక్రయిస్తున్నప్పుడు మేధావులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. విమానశ్రయాలు, నౌకాశ్రయాలు, ఎస్ఐసి, టెలికాం, రైల్వే, రోడ్డు మార్గాలు అంబానీ, ఆదానీలకు అమ్మినప్పుడు ఈ మేధావులు ఎక్కడ దాక్కున్నారో తెలపాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్థి అంటూ ఏది ఉండబోదని, అలా జరిగితే నష్టం కేవలం పేదప్రజలకేనన్నారు. రాబోయే రోజుల్లో పేదలు, అట్టడుగు వర్గాలు, మధ్య తరగతి ప్రజలు దోపిడి గురికాకుండా ఉండాలంటే కమ్యూనిస్టులు పక్షాన, ఎర్రజెండాకు అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బెజవాడ రవిబాబు, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, నాయకులు యంగల ఏలేషు, మాతాంగి శ్రీనివాసరావు ,బలుగూరి అచ్చయ్య, యంగల సుందర్ రావు, యంగల కేళీ, చావా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
 
శాఖ కార్యదర్శిగా, సహాయ కార్యదర్శులుగా....
 
కలకోట శాఖ కార్యదర్శిగా యంగల పెద్దరమేష్, సహాయ కార్యదర్శులుగా తోటపల్లి సుదర్శన్, యంగల వెంకటమ్మలతో మరో 9 మంది కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఎన్నిక పట్ల మండల పార్టీ, జిల్లా పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాగల రోజుల్లో సిపిఐ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని, పార్టీ పిలుపు మేరకు ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తామన్నారు.