ఆక్సిజన్ ప్లాంట్ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్ భారతి

Published: Tuesday September 21, 2021
మంచిర్యాల, సెప్టెంబర్ 20, ప్రజాపాలన : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవరణలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించేందుకు వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టి.ఎన్.ఎం.ఐ.డి.సి. ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్సిజన్ ప్లాంట్ను త్వరగా ప్రారంభించి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్లాంట్ ఇన్స్టాలేషన్ పూర్తి చేయాలని తెలిపారు. ఆసుపత్రిలో జరుగుచున్న మరమ్మత్తు పనులు, వివిధ వార్డులను పరిశీలించారు. జిల్లా నలుమూలల నుండి ఆసుపత్రికి వచ్చే బాధితులతో స్నేహ పూర్వకంగా మెదులుతూ వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి ఆవరణలో కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.