బసవేశ్వరుని ఆశయ సాధన దిశగా పయనిద్దాం

Published: Monday September 06, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజాపాలన : విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని ఆశయ సాధన దిశగా పయనిద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వారం మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన మహాత్మా బసవేశ్వరుని విగ్రహాన్ని బంట్వారం గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 12వ శతాబ్ధంలో బసవేశ్వరుడు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. అప్పట్లో ఆయన చేసిన వచనసాహిత్యం ప్రజలకు నేడు ఎంతగానో స్ఫూర్తి దాయకమన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడని, అప్పట్లోనే సమ సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశారని గుర్తు చేశారు.
గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి :
ధారూర్ మండల పరిధిలోని ధారూర్, దోర్నాల్ గ్రామాల మధ్య వాగు శనివారం రాత్రి కురిసిన వాన కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటే ప్రయత్నంలో దోర్నాల్ గ్రామానికి చెందిన గోరయ్య కొట్టుకపోయాడు. వాగులో కొట్టుకొనిపోయిన వ్యక్తి ఆచూకి లభ్యమయ్యే వరకు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. దోర్నాల్ వాగులో కొట్టుకొని పోయిన విషయం తెలిసి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రమాదం జరిగిన చెక్ డ్యామ్ ప్రాంతాన్ని పరిశీలించారు. గజ ఈతగాల్లను పిలిపించి వారి సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టాలని పోలీస్ అధికారులను రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అయినందు వలన వెంటనే కాంట్రాక్టర్ ను తొలగించి, ఇతర కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలందరూ ప్రమాదంగా ప్రవహిస్తున్న వాగులను దాటవద్దన్నారు. *తల్లిదండ్రులు జన్మ ఇస్తే ఆ జన్మకు ఒక గుర్తింపు ఇచ్చేది గురువులు :
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం జడ్పి చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డితో కలిసి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మద్గుల్ చిట్టెంపల్లిలోని డిపిఆర్సిలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆ జన్మకు ఒక గుర్తింపు ఇచ్చేది గురువులేనని కొనియాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మాతృ దేవోభవ.. పితృ దేవోభవ.. ఆచార్య దేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత మహోన్నత స్థానాన్ని గురువుకు ఇచ్చారన్నారు. విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో మనం సన్మార్గంలో నడవడంలో వారి పాత్ర కీలకం అన్నారు. భవిష్యత్‌లో ఏ స్థాయిలో ఉన్నా ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవాలన్నారు. విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉందన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసి వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్య మౌళిక వసతుల కల్పనల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్, జడ్పి వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ భేగమ్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డిఈఓ రేణుకా దేవి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.