బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం: ఎస్ఐ తెజావత్ కవిత

Published: Monday October 03, 2022
పేషెంట్లకు ఎస్ఐ చేతుల మీదుగా మందులు పంపిణీ
 
 
బోనకల్, అక్టోబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి: బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలు అభినందనీయమని స్థానిక ఎస్ఐ టి కవిత అన్నారు. మండల కేంద్రంలోని మేఘ శ్రీ హాస్పిటల్ నందు ప్రతి నెల మొదటి ఆదివారం అమరజీవి తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్థం బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించే బిపీ, షుగర్, కంటి, దంత ప్రత్యేక మెగా క్యాంపును ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల ప్రజల అభ్యున్నతి కోసం, అహర్నిశలు కృషిచేసిన మహోన్నత వ్యక్తి పేరుతో క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ గత రెండు సంవత్సరాలుగా రూ.100 కే బిపీ, షుగర్ మందులను అందజేస్తూ క్యాంప్లను నిర్వహిస్తూ పేదల మన్ననలనుపొందుతుందన్నారు. ఈ క్యాంపు విశేషతను గ్రామాల్లో తీసుకెళ్లి మండలంలోని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకున్నప్పుడే క్యాంపుకు సార్థకత కలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా క్యాంపును నిర్వహించే మేఘశ్రీ హాస్పిటల్ వైద్యులను, సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ క్యాంపులో మేఘ శ్రీ హాస్పిటల్ ప్రముఖ జనరల్ వైద్యులు టి పవన్ కుమార్, ఎల్ గంగాధర్ గుప్తా, దంత వైద్య నిపుణులు ఎస్ ఉదయ్ కిరణ్, సీనియర్ ఆర్థో ఫిజియోథెరపిస్ట్ బుంగ శిరీష లు వైద్య సేవలు అందించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు, హాస్పటల్ వైద్యులు, క్యాంపు నిర్వహకులు, సీపీఐ శ్రేణులు ఎస్ఐ కవితను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తూము రోషన్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, ఆర్ఎంపీడబ్లూఏటీఎస్ జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు, వైఎస్ ఎంపిపి గుగులోత్ రమేష్, గార్లపాడు ఎంపిటిసి ముక్కపాటి అప్పారావు, క్యాంపు నిర్వాహకులు ఆకెన పవన్, సాధనపల్లి అమర్నాధ్, యంగల గిరి, కళ్యాణపు భవాని తదితరులు పాల్గొన్నారు.