వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యల పుట్ట

Published: Saturday October 09, 2021
22 సెక్షన్లు 800 మంది విద్యార్థులు
సరిపోను తరగతి గదులు లేక మెట్ల మీద కారిడార్ లో కూర్చుంటున్న విద్యార్థులు
శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 08 అక్టోబర్ ప్రజాపాలన : సిఎం కెసిఆర్ అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా చేసే కృషి అభినందనీయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యల పుట్టను శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ద్వారా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలలో బోధన జరుగుతుందని అన్నారు. 22 సెక్షన్లు 800 మంది విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల కళకళలాడుతున్నదని పేర్కొన్నారు. తరగతి గదులు 7 మాత్రమే ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. సరిపోను తరగతి గదులు లేక విద్యార్థులు మెట్లు, కారిడార్ మీద కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షిప్టుల వారీగా తరగతులను నడిపినా అకామ్డేషన్ సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అకామ్డేషన్ సమస్యను విద్యా శాఖ మంత్రి మానవతా దృష్టితో ఆలోచించి పరిష్కరించాలని కోరారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 2 కోట్ల 30 లక్షల నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇందులో నుండి ఒక కోటి రూపాయలను మాత్రమే నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుందని విచారం వ్యక్తం చేశారు. ఇంకా ఒక కోటి 30 లక్షల రూపాయల నిధులను త్వరగా విడుదల చేసి కళాశాలలోని సమస్యల పరిష్కారానికి మార్గదర్శిగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలో గణితం, హిందీ అధ్యాపకులను, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అడిగిన అంశాలను నోట్ చేసుకుంటామని వివరించారు.