అందంగా మూడో వార్డు రోడ్డు... అద్వానంగా నాలుగవ వార్డు రోడ్లు.. అవి ఏప్పుడో?

Published: Monday June 21, 2021
బాలపూర్, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడో వార్డు లోని రహదారులు అద్దంగా మెరుస్తుంటే నాలుగో వార్డు పరిధిలోని న్యూ మధుర పూరి కాలనీ, శిరిడి నగర్ కాలనీ రోడ్లు కంకర తేలిన అధ్వానంగా తయారయ్యాయని కాలనీ వాసులందరూ వాపోతున్నారు. న్యూ మధురాపురి కాలనీలో, షిరిడి నగర్ కాలనీ లలో భూగర్భ డ్రైనేజీ పనులు గత సంవత్సర కాలంగా "నత్త" నవ్వి పోయే విధంగా సాగుతూ.…...........నే ఉన్నాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. మూడో వార్డు కార్పొరేటర్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన వార్డు పరిధిలోని పనులను పరుగులు పెట్టిస్తుంటే నాలుగో వార్డ్ కార్పొరేటర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి అత్యంత ఆప్తులు అయిన పనుల నిర్వహణలో తిరోగమనంలో పురోగమిస్తున్నారని కాలనీవాసులు అంటున్నారు. ఇక్కడ రహదారుల నిర్మాణం చేపట్టాలంటే భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి కావాలి భూమి పొరలలో పెద్ద పెద్ద బండరాళ్ళు రావడంతో వాటిని తొలగించడంలో సాంకేతిక ప్రక్రియ చేపట్టకుండా కృత్రిమంగా పనులు చేస్తూ ఏళ్లు గడపడం వలన న్యూ మధుర పూరి కాలనీ, షిరిడి నగర్ కాలనీ వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రహదారి అధ్వానంగా తయారు కావడంతో ఈ రెండు కాలనీల ప్రజలు నంది హిల్స్ రహదారికి వెళ్లి అక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇకనైనా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు తాజా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక కార్పొరేటర్ సం రెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి పనుల పురోగతిపై చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.