వికారాబాద్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు

Published: Thursday August 05, 2021
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు కృతజ్ఞతాభివందనాలు తెలిపిన బంట్వారం నాయకులు
బంట్వారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 ఆగస్ట్ ప్రజాపాలన : ఏడు వసంతాల నుండి నిరీక్షిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల కలను నెరవేర్చిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు బంట్వారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బంట్వారం నాయకులు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. మంగళవారం బంట్వారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ద్వారా వికారాబాద్ ఎమ్మెల్యే తన వాణిని బలంగా సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిల దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలలోని ఫీజులు కట్టలేక ఎందరో విద్యార్థులు ఇంటర్మీడియట్ తోనే సరిపెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండి ఉంటే నిరుపేదలు కూడా చదువుకోడానికి అవకాశాలు మెండుగా ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు కళాశాలలో ఫీజుల మోతకు తల్లిదండ్రులు తల్లడిల్లేవారని అన్నారు. సమర్థవంతమైన నాయకుడైన ఎమ్మెల్యే పట్టువదలని విక్రమార్కునిలా కృషి చేసి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లేశం పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు నర్సింలు సర్పంచులు నరసింహారెడ్డి నర్సింలు నాయకులు శ్రీనివాస్ వెంకట్ శరణ రెడ్డి ప్రవీణ్ వెంకటయ్య లక్ష్మయ్య ఎల్లయ్య కలింపాషా శివకుమార్ శాంతకుమార్ మల్లేష్ ఆశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.