వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ

Published: Thursday September 09, 2021
 మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 08, ప్రజాపాలన : వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని హైటెక్ సిటి లో మట్టి వినాయకులను పంపిణీ చేయనున్నట్లు వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షుడు రామ్ ప్రకాష్ తెలిపారు. వినాయక చవితి వస్తుందంటే రంగు రంగుల గణపతుల విగ్రహాలను తీసుకువస్తుంటారు. గతంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌, కృత్రిమ రంగులతో చేసిన వినాయకుడి విగ్రహాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేవారు. ప‌ర్యావ‌ర‌ణంపై ప్ర‌త్యేకంగా జల కాలుష్యంపై ప్రజలకు అవగాహన పెరగడంతో క్రమంగా మట్టి గణపతి ప్రతిమలను ప్ర‌తిష్టించేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆవు పేడతో చేసిన అందమైన వినాయకుడి విగ్రహాలను ఇళ్లలో, పూజా మండపాల్లో ప్ర‌తిష్టిస్తున్నారు. అయితే ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షించేందుకు బంక మట్టి గోమయంతో గణపతులను తయారు చేయిస్తున్నారని, గ‌త కొన్నేళ్ళుగా ఉచితంగానే మట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. శాస్త్రీయంగా గోవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం అన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. అదే ఆలోచనతో బంక మట్టి గోమయంతో గణపతులను తయారు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. పురాతన ప్రక్రియను అనుసరించి ఆవుపేడతో రకరకాల సైజుల్లో వినాయకుడి అందమైన విగ్రహాలను తయారు చేసి ఉచితంగానే భ‌క్తుల‌కు అంద‌జేస్తున్నామ‌ని చెప్పారు. కళాకారులు ఎంతో శ్రమించి గోమయ గణేశ విగ్రహాల‌ను రూపొందిస్తున్నా ర‌న్నారు. ఇవి పూర్తిగా పర్యావరణహితమైనవి కావ‌డంతో భ‌క్తులు గోమ‌య గ‌ణ‌ప‌య్య‌ను ప్ర‌తిష్టించ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నార‌న్నారు. కోవిడ్ ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ‌త ఏడాది గోమ‌య గ‌ణేష్ విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌లేద‌ని, బంకమట్టి తో తయారు చేసి మాత్రమే అందించామని ఈ ఏడాది మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో బంక మట్టి గోమ‌య వినాయ‌క విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు మడుపు రామ్ ప్రకాష్ తెలిపారు.