మధిర డివిజన్లో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

Published: Tuesday September 27, 2022

మధిర సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి  మధిర నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. నియోజకవర్గంలో ఎక్కడలేని విధంగా మూడు నదులు ఉండటంతో ఇసుక మాఫియాకు కలిసొచ్చింది. మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు, మధిర, బోనకల్ మండలాల్లో వైరా నది, చింతకాని, ముదిగొండ మండలాల్లో మున్నేరు నదులు ప్రవహిస్తున్నాయి. ఈనదుల్లో పుష్కలంగా ఇసుక ఉండటంతో ఇసుక మాఫియా ఇసుకను కాజేసేందుకు చేసేందుకు రంగంలోకి దిగింది.  తొలత అభివృద్ధి పనుల పేరుతో ఇసుక మాఫియా అధికారులను మచ్చిక చేసుకొని ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీస్ శాఖ, మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ నిద్ర నటించడంతో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు గతంలో టాస్క్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు అందుకున్న టాస్క్ పోర్న్ పోలీసులు వరుసగా దాడులు చేయటంతో  కొద్దికాలం పాటు మధిరలో ఇసుక అక్రమ రవాణా ఆగిపోయింది. పదిహేను రోజుల నుండి మధిర డివిజన్లో ఇసుక అక్రమ రవాణా భారీగా కొనసాగుతుంది. మండలంలో రాయపట్నం బుచ్చిరెడ్డిపాలెం వంగవీడు సిరిపురం నుండి భారీ స్థాయిలో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిపోతుంది. అదేవిధంగా ఎర్రుపాలెం మండలం చొప్పకట్లపాలెం, సఖినివీడు, తక్కెళ్ళపాడు, బనిగండ్లపాడు బోనకల్లు మండలం మోటమర్రి, కలకోట, బ్రాహ్మణపల్లి చింతకాని మండలం చిన్న మండవ ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామాలనుండి  ఇసుక భారీ స్థాయిలో ఖమ్మం కేంద్రానికి అక్రమ రవాణా కొనసాగుతుంది. అభివృద్ధి పనుల పేరుతో ఒక కూపన్ తీసుకుంటున్న ఇసుక మాఫియా ఆ కూపన్ పై 3 నుంచి 5 ట్రాక్టర్ల  ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్నారు. ఇసుక అదనంగా తీసుకెళ్లేందుకు పోలీసులకు, మైనింగ్, రెవెన్యూ శాఖలకు ఇసుక మాఫియా భారీ నజారాణాలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి తగ్గట్టు ఆయా శాఖల అధికారులు  ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.  రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలను భరించలేక ఇటీవల  నక్కల గరబు గ్రామ ప్రజలు ఇసుక ట్రాక్టర్లకు అడ్డం తిరిగి వాటిని పట్టుకుని మధిర రూరల్ పోలీసులకు అప్పగించారు. స్థానికంగా గృహాలు నిర్మించుకునేందుకు ఒక ట్రక్కు ఇసుక తెచ్చుకోవాలంటే అనేక నిబంధనలు పెడుతున్న స్థానిక అధికారులు ప్రతిరోజు వందల సంఖ్యలో మధిర నుండి ఖమ్మంకు అక్రమంగా ఇసుక ఎలా వెళ్తుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట నిరంతరం ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని మధిర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై మధిర సిఐ మురళిని వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా అవుతున్నట్లు సమాచారం తెలిస్తే తక్షణమే తనకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.