పత్రికా ప్రకటన: 26 ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణ బీసీల జాబితాలో చేర్చడానికి వ్యతిరేకంగా ఉద్యమిం

Published: Saturday December 03, 2022

----@---
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఆంధ్రకు చెందిన 26 బీసీ కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీల లిస్టు నుండి తొలగించింది.
ఆ కులాలు తెలంగాణ లో అందుకు లేకపోవడమే కారణం. 1970 లో అనంత రామన్ కమిషన్ ఈ కులాలు ఏఏ జిల్లాల్లో ఉన్నాయో పేర్కొని ఆ జిల్లాల్లో బీసీలు గా గుర్తించింది. ఆ జిల్లాలు ఆంధ్ర ప్రాంతానివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ26 కులాలు తెలంగాణ కు సంబధించినవి కావు కనుక వాటిని తెలంగాణ లిస్టు నుండి తొలగించడం జరిగింది. తద్వారా తెలంగాణ బీసీల అవకాశాలు మొదటిసారి మొత్తం తెలంగాణ వారికే లభించాయి. మెడికల్ ఇంజనీరింగ్ పిజీ కోర్సుల్లో 60 ఏళ్లు తర్వాత మొదటిసారి తెలంగాణ బీసీలు తమ వాటాను పూర్తిగా తామే పొందగలిగారు. గత 60 ఏళ్లలో తెలంగాణ ప్రాంత విద్య ఉద్యోగ అవకాశాలను ఆంధ్ర ప్రాంతం వారు ఆక్రమిస్తూ వచ్చారు. అలా ఆంధ్ర బీసీలు ఎస్సీలు కూడా తెలంగాణ బీసీల హక్కులు అవకాశాలను ఆక్రమించారు. అలా ఆక్రమించి హైదరాబాద్ తదితర ప్రదేశాల్లో నగరాల్లో ఉద్యోగాలు చేసి స్థిర పడ్డారు. ఇపుడు తమ పిల్లలకు కూడా తెలంగాణ ప్రాంత బీసీ అవకాశాలు కావాలంటున్నారు. . ఆరు దశాబ్దాలుగా తెలంగాణ బీసీల ఇవకాశాలను గుంజుకొని అనుభవించడమే కాకుండా ఇంకా ఆ అవకాశం కావాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులపై బీసీ కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ను నివేదిక కోరింది. నేను తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. తెలంగాణ లో ఆంధ్రకులాలకు బీసీ రిజర్వేషన్లు కలిపించేదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఫలితమేమిటి? సమైక్య రాష్ట్రంలో జరిగినట్టే అంతర్గత వలసలు , ఆక్రమణలు ఆధిపత్యం కొనసాగుతాయి. సామాజికంగా విద్యా పరంగా చారిత్రక పరిణామాల వల్ల వెనక బడిన తెలంగాణ బీసీల అవకాశాలను ఒకటి రెండు తరాలు ముందు ఎదిగి విద్యా వంతులై ఉద్యోగులై స్థిరపడిన ఆంధ్ర బీసీ వర్గాలు లాక్కొన్నారు. ఇంకా లాక్కోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే దశాబ్దాలుగా తెలంగాణ బీసీల అవకాశాలు కొల్ల గొట్ట పడ్డాయి. ఇపుడు వారిని తెలంగాణ లో బీసీలుగా గుర్తిస్తే తెలంగాణ బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది.
26 కులాల వారు ఆంధ్రకు చెందిన కులాలు. తెలంగాణ లో బీసీలుగా గుర్తించాలని ఎందుకు అడుగుతున్నారు? వీరుఆంధ్రలో బీసీలే గదా! మరి తెలంగాణ లో ఎలా స్థిర పడ్డారు? సమైక్య రాష్ట్రం లో వచ్చి విద్య ఉద్యోగాలు ఆక్రమించి స్థిర పడ్డారు. ఇలా స్థిర పడిన వారితో గ్రామీణ ప్రాంతాల్లో వున్న తెలంగాణ పేద బీసీలు పోటీ పడలేరు. వారికున్న సౌకర్యాలు అవేర్ నెస్ తెలంగాణ గ్రామీణ బీసీ సామాజికవర్గానికి ఉండే అవకాశం లేదు. తెలంగాణ బీసీలు జాబితాలో చేర్చితే ఇబ్బడి ముబ్బడిగా ఇంకా ఆంధ్ర నుండి వేసేసి వస్తూ తెలంగాణ బీసీల అవకాశాలు ఆక్రమిస్తూనే ఉంటారు.
అందువల్ల తెలంగాణ బీసీల హక్కులు అవకాశాలు హరించే ఆక్రమించే నోటికాడి అన్నాన్ని గుంజుకొని తినే అవకాశం 26 ఆంధ్రా
బీసీ కులాలకు కల్పించవద్దని కోరుతున్నాము.
ఆంధ్రా బీసీ లకు తెలంగాణ లో EWS రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంది. దానిలో తమ అవకాశాలు సాధించుకోవాలి. . ఒక లెక్క ప్రకారం తెలంగాణ లో బీసీ ఎస్సీ ఎస్టీ కాని ఇతర కులాలు 11 శాతమే గనుక అందులో పేదలు 30 శాతమే అనగా 3-4 శాతమే . 10 శాతం చాలా ఎక్కువ. గనుక 10 శాతం EWS లో విస్తారమైన అవకాశం ఉంది.
కనుక 26 ఆంధ్ర బీసీ కులాలకు 103 వ రాజ్యాంగ సవరణతో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. 54 శాతం ఉన్న బీసీ లకు 27 శాతం కేంధ్రంలో 29 శాతం మాత్రమే రాష్ట్రంలో రిజర్వేషన్లు న్నాయి. బీసీలకు జనాభా ప్రకారం 54 శాతం చేరుకునే విధంగా కనీసం బీసీలలో పేదలు 70 శాతం అనుకుంటే 44 శాతం రిజర్వేషన్లు ఉండాలి. మురళీధర్ రావు కమిషన్ నివేదికను 103 వ రాజ్యాంగ సవరణ కరక్టే అని సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి కొత్త వెలుగు ప్రసరింప జేసి 44 శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచడం అవసరం.
బీసీల్లారా!
నిద్ర లేవండి! నష్టం జరిగక ముందే ముందే మేల్కొనండి. గొంతెత్తండి! అడుగు ముందుకు వేయండి. కదం కదం కలపండి. !
26 కులాల ఆంధ్రా బీసీల్లారా!
ఆంధ్రా బీసీలు గోబ్యాక్ అని నినాదం ఇచ్చే పరిస్థితి తేకండి!
తెలంగాణ లోని
సకల బీసీ కులాల్లారా! మరోసారి మోసం పోకండి!
తెలంగాణ తెచ్చుకున్న ఫలాలను మంది పాలు కానీయకండి!
తెలంగాణ బీసీ కమిషన్ కు మీ సంఘాల ద్వారా నిర్ణీత ఫార్మాట్లలో మీ రు 26 కులాలను తెలంగాణ బీసీల జాబితాలో చేర్చడానికి పూర్తి వ్యతిరేకం అని రాతపూర్వకంగా సమర్పించండి. మన పిల్లల భవిష్యత్తు రక్షణకు ఉద్యమించండి.

సామాజిక తత్వవేత్త
బి ఎస్ రాములు
తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్.