ప్రతి ఒక్కరూ స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలి

Published: Thursday December 09, 2021
వికారాబాద్ బ్యూరో 08 డిసెంబర్ ప్రజాపాలన : ప్రతి ఒక్కరు స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ "మీతో నేను" కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజునాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఆర్.వెంకటేశం సమక్షంలో నాగసమందర్ గ్రామంలో ఉదయం 7 గంటల నుండి 11 గంటల  వరకు పర్యటించారు. "మీతో నేను" పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలను తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో మిషన్ భగీరథ నీటిని సరైన పద్దతిలో వాడుకోవాలని చెర్రలు, ట్యాపులు తీయడం లాంటివి చేస్తే నీటి సరఫరా అందరికి సరిపోదని ప్రజలకు సూచిస్తూ, లీకేజీల సమస్యలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మురుగు కాలువల సమస్య ఎక్కువగా ఉందని, సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలన్నారు. వ్రేలాడుతున్న విద్యుత్ వైర్లు సరిచేసి, రాత్రి వేళలో మాత్రమే విద్యుత్ దీపాలు వెలిగే విధంగా థర్డ్ వైర్ పద్ధతి ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సిబ్బంది ప్రజలకు  అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ & సిబ్బంది అందుబాటులో ఉండాలని, పశు వైద్య శాలలో పశు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సరైన సేవలు అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఏఎన్ఎం రాధారాణిని సన్మానించారు.  

రైతు సంక్షేమ రథసారధి సీఎం కెసిఆర్ : 

ధారూర్ మండల పరిధిలోని నాగసమందర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలలో నుండి రైతు సంక్షేమం కోసం ఉద్భవించినవే రైతు వేదికలు అన్నారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ కాలంలో ఎలాంటి పంటలు వేయాలి ఎలాంటి ఎరువులు ఉపయోగించాలి పంట అధిక ఉత్పత్తులు ఎలా రాబట్టాలి అనే వివిధ అంశాలపై రైతులు చర్చించుకోవడానికి రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. 
స్వరాష్ట్రంలో అన్నపూర్ణగా అవతరించిన రాష్ట్రమే తెలంగాణ:
ధారూర్ మండల పరిధిలోని నాగసమందర్ లోని రైతు వేదిక సమీపంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24గంటల కరెంటు, సాగు నీరు, సబ్సిడీ, రైతు బంధు, రైతు భీమా లాంటి ఎన్నో కనివిని ఎరుగని రీతిలో రైతులకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక రైతు రాజ్యం తెలంగాణ రాష్ట్రం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యత ప్రమాణాల ఆధారంగా మద్దతు ధరతో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు మార్కెట్ యార్డ్ లోనే గిట్టుబాటు ధర లభిస్తుందని దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద కరోనా నిబంధనలు పాటించాలని, రైతులు ఒకే దగ్గర గుమికూడకుండా  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభం : 
ధారూర్ మండల పరిధిలోని నాగసముందర్ సమీపంలో కోట్ పల్లి ప్రాజెక్ట్ అలుగు పై అంచనా విలువ 50లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా, జడ్పీటీసీ కోస్నం సుజాత వేణుగోపాల్ రెడ్డి, ఎంపిపి విజయలక్ష్మి, వైస్ ఎంపిపి విజయ్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసి మాజీ చైర్మన్ రాములు, రైతుబంధు అధ్యక్షుడు రుద్రారం వెంకయ్య ముదిరాజ్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య ముదిరాజ్, పిఏసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.