పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు చిల్లులతో వృధా అవుతున్న నీరు

Published: Thursday September 15, 2022
ప్రజాపాలన ప్రతినిధి నవాబ్ పేట. సెప్టెంబర్ 14
 
మండలంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.ఈ వర్షాకాలం సీజన్ లో అడపా, దడపా కురిసిన వర్షాల కారణంగా  చెరువులు కుంటలు వరద నీటితో 
నిండిపోయి నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. 
సుమారు దశాబ్ద కాలం తర్వాత చెరువులు కుంటలు నీటితో నిండిపోయి దర్శనమిస్తుండటంతో మండల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువులు కుంటలు నీటితో నిండిపోయి కళకళలాడుతుంటంతో ఈ సీజన్ లో తమ పంటలకు ఎలాంటి డోకా లేకుండా పోయిందనే ధీమాను రైతులు వ్యక్తం చేస్తున్నారు.ఈ వర్షాకాలం సీజన్ ఆరంభం నుండి
వరి పంట సాగుకు అనుకూలంగా వర్షం కురిసింది.దాంతో రైతులు పెద్ద ఎత్తున వరిపంటను సాగుకు చేశారు. పంట పొలాల్లో సమృద్దిగా నీరు నిల్వ ఉంటున్నందున పంటలు ఆశాజనకంగా పెరుగుతున్నాయి. చెరువులు, కుంటల అలుగులు పారుతుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
 ప్రకృతి వరప్రసాదంగా లభించిన వరదనీటిని చెరువులు కుంటలలో నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటే మరో పంటకు కూడా ఆ నీరు ఉపయోగపడే అవకాశం ఉంది.
అయితే నీటి నిల్వ విషయంలో సంబంధిత అధికారులు, నీటి వినయోగదారుల సంఘాల నాయకులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. దాని వల్ల చెరువు కట్టలకు, అలుగులకు ఏర్పడ్డ చిన్న,చిన్న రంద్రాల
 ద్వారా పెద్ద మొత్తంలో నీరు 
వృధా అవుతుంది. చెరువులు, కుంటలకు ఏర్పడిన చిల్లులను, గండ్లను పూడ్చడంలో అధికారులు శ్రద్ద తీసుకోవడంలో విఫలం అయ్యారు. సంబంధిత అధికారులు, నీటివినియోగదారుల సంఘాల నాయకులు సమిష్టిగా  కృషి చేసి పటిష్టంగా మరమ్మత్తు పనులు చేపట్టి నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు  డిమాండ్ చేస్తున్నారు.