లూపస్ వ్యాధిగ్రస్తులకు సహాయం కోసం లూపస్ పేషెంట్ సపోర్ట్ గ్రూప్

Published: Monday May 09, 2022
రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : లూపస్ వ్యాధి గ్రస్తులకు ఆర్థిక, భౌతిక, మానసికంగా చేయూతని అందించేందుకు పేషెంట్ సపోర్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ వెల్లడించింది. మే 10న ప్రపంచ లూపస్ డే ను పురస్కరించుకొని ఆదివారం లూపస్ వ్యాధి పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు అనుభూతి పేరుతో సోమాజిగూడ హరిత ప్లాజా హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రుమటాలజీ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కిరణ్ , ఆర్గనైజింగ్ సెక్రటరీ జుగల్ కిషోర్, వైద్యులు కీర్తి తలారి, సునీత తదితరులు పాల్గొని మాట్లాడారు. రుమటాలజీ కి చెందిన వంద రకాల వ్యాధుల లో లూపస్ వ్యాధి ఒకటి అని అన్నారు. దీర్ఘకాలిక జ్వరం, అలసట, బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు, వాపు ముఖం, సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రని దద్దుర్లు, జుట్టురాలడం, నోటి పూతలు మొదలగునవి ఈ వ్యాధి లక్షణాలు అని తెలిపారు.ఈ వ్యాధి సోకడం ద్వారా చర్మం, కీళ్లు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు తో సహా శరీరంలోని అన్ని భాగాలను క్షీణింప చేస్తుందని అన్నారు. ఈ వ్యాధి దీర్ఘకాల వ్యాధి అని అన్నారు. దీనిని పూర్తిగా నయం చేయకపోయినా అత్యాధునిక వైద్య పద్ధతుల ద్వారా  అరికట్టవచ్చని తెలిపారు. వివిధ కారణాల వల్ల రుమటాలజీ  వ్యాధి పై అవగాహన లేకపోవడం వల్ల  చాలామంది రోగులలో రుమటాలజిస్ట్ వద్దకు చేరుకునే  ముందే వారి అవయవాలు బాగా దెబ్బతింటున్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నయన్ పటేల్, స్ఫూర్తి, ఫణి కుమార్, విజయ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.