పండుగ పూట విషాదం * నిండు బకెట్లో గాలిలో కలిసిన పసివాడి ప్రాణం – వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో

Published: Monday January 16, 2023
వికారాబాద్ బ్యూరో 14 జనవరి ప్రజా పాలన : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో భోగి పండుగ పూట విషాదం నెలకొంది. ఆడుకుంటూ వెళ్లి నిండు బకెట్లో తలకిందులై పసివాడి ప్రాణం పోయింది. ఈ సంఘటన శనివారం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని పాత శిశు మందిర్ సమీప ప్రాంతానికి చెందిన దత్తేశ్వర్ భాగ్యలక్ష్మిల చిన్న కుమారుడు విఖ్యాత్. గత డిసెంబర్ 24న విఖ్యాత్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ వేడుక సంతోషాలను మరువక ముందే ఇంట్లో విషాదం నెలకొంది. శనివారం ఉదయం విఖ్యాత్ ఆడుకుంటూ బాత్ రూం సమీపంలోని నిండు బకెట్ వద్దకు చేరుకున్నాడు. బకెట్లో పసివాడు తలకిందులుగా పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీశారు. అప్పటికే విఖ్యాత్ ప్రాణాలు విడిచాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని ముద్దాడుతూ రోదించిన తీరు స్థానికుల చేత కంట కన్నీరు పెట్టించింది.