ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి

Published: Thursday December 15, 2022
* ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
వికారాబాద్ బ్యూరో 14 డిసెంబర్ ప్రజాపాలన : ఓటర్ నమోదు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో ఓటర్ నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8 ఆన్లైన్ డేటా ఎంట్రీ, ఓటర్ జాబితా రూపకల్పన పై వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారిగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కొరకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 26 లోపు పరిశీలించి డిస్పోజ్ చేయాలని, అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆయన సూచించారు.  ఉపాధి దృష్ట్యా కొంత మంది వలస వెళ్లిన వారు పట్టణాలలో జీవిస్తున్నప్పటికి గ్రామాల్లో కూడా వారికి ఓటు హక్కు ఉంటుందని, రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వివరాలు పరిశీలించి, అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఈ.ఆర్.ఒ లు చర్య తీసుకోవాలని ఆయన సూచించారు. 
ఓటరు నమోదు సమయంలో ట్రాన్స్ జెండర్లు,  సెక్స్ వర్కర్లు వివిధ ప్రత్యేక వర్గాల వారందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన  దివ్యాంగులందరికి  ఓటు హక్కు కల్పించి, పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. జిల్లాలలో 100 సంవత్సరాలు నిండిన ఓటర్ల  వివరాలను కూడా ధృవీకరించాలని ఆయన సూచించారు.  ఓటరు జాబితా పకడ్బందీగా రూపోందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ లను ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.