మంత్రి ఈటల రాజేందర్ పై కేసీఆర్ దారుణమైన కుట్ర

Published: Monday May 03, 2021
బీసీ నేత ముసిపట్ల లక్ష్మీ నారాయణ విద్యార్థి నేత జాజాల రమేష్
 
జగిత్యాల, మే 01, (ప్రజాపాలన ప్రతినిధి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేందర్ తో ఎలాంటి విచారణలేకుండా భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుండి తొలగించడం చాలా బాధాకరమని, రాజేందర్ కరోన కష్టకాలంలో ఎంతో మందికి సేవాలందించారని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాజాల రమేష్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన గొప్ప నాయకుడని, ప్రజల ఆదరాభిమానాలు పొందిన బీసీ నేత రాజేందర్ పై  ప్లాన్ ప్రకారమే భూ కబ్జా ఆరోపణలు చేసినట్లు అనిపిస్తుందని, కుట్ర పూరితంగా వ్యవహరించడం దారుణమని, తెలంగాణ రాష్ట్ర మంత్రుల అందరి ఆస్తులపై కేసీఆర్ బంధువుల ఆస్తులు భూకబ్జాలపై కూడా విచారణ చేయించాలని అన్నారు. కేవలం బీసీ నేతపై మాత్రమే కక్ష్య పూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. నాడు దళితబహుజన ఉపముఖ్యమంత్రి రాజయ్యను, చెరుకు సుధాకర్, నేడు బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటెల పై తప్పుడు ఆరోపణలు సృష్టించడం శోచనీయమన్నారు. చెరువు భూమిని కబ్జా చేస్తున్నా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పేదల భూముల్ని గుంజు కుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్న మంత్రి మల్లారెడ్డి, మంత్రి పువ్వాడ ఇంకా ఎంతో మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళందరి అక్రమాలు మన దొర కేసీఆర్ కు కనపడటం లేదా? అని వారు ప్రశ్నించారు. పదవుల విషయంలో తన కొడుకు కేటీఆర్ కు అడ్డం వస్తారని అభియోగాల నాటకం దుర్మార్గమని విమర్శించారు.