సింగరేణి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి

Published: Monday May 09, 2022
టి.యన్.టి.యు.సి నాయకుల డిమాండ్
బెల్లంపల్లి  మే 7 ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని శాంతి ఖని లాంగ్ వాల్ గని నుండి సింగరేణి కి చెందిన పైపులను అక్రమంగా తరలించిన, శాంతి ఖని ఫిట్ కార్యదర్శి టీబీజికేఎస్, నాయకుడు దాసరి శ్రీనివాస్, అతనికి సహకరించిన గని ఏజెంట్ వెంకటేశ్వర్ ల పై, అధికారులు జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని టీ ఎన్ టి యు సి నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బాబు క్యాంప్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, శాంతి ఖని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, గని నుండి పట్టపగలు 38 పైపులను టీబీజికేఎస్ గని స్థాయి నాయకుడు, ఇంటికి తరలించడం రెడ్ హ్యాండెడ్ గా, దొరికిన సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. శాంతిఖని  గనిలో సిఎంఎస్ యంత్రాన్ని  దింపి సంవత్సరం కాలం గడుస్తున్నా, ఇప్పటి వరకు ఉత్పత్తి పొందలేకపోయారని, గనిలో కార్మికులు చిన్న చిన్న తప్పులు చేసిన కార్మికులకు, చార్జిషీట్ ఇచ్చి, మెమోలు జారీ చేసి, సస్పెండ్ చేసే అధికారులు,  గని నుండి 38 పైపులను దొంగిలించి దొరికిన నాయకుడిపై ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. యాజమాన్యం, గుర్తింపు సంఘం టి బి జి కే ఎస్ కు తొత్తుగా మారిందని, టీబీజీకేఎస్ నాయకులు చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు యాజమాన్యం సహకరిస్తుందని అన్నారు. ఇలాంటి చర్యలను కార్మిక సంఘంగా టీఎన్టీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. గుర్తింపు సంఘం నాయకులు గా చలామణి అవుతూ మస్టర్లు పడుతూ, విధులకు హాజరు కాకుండా నెల నెల జీతాలు పొందుతూ, సింగరేణి  సొత్తును అక్రమంగా తరలిస్తున్న వారికి శ్రమశక్తి అవార్డు ను ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. వెంటనే ఆయనకు ఇచ్చిన  శ్రమశక్తి అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పైపులు తరలించడానికి గని ఏజెంట్ వెంకటేశ్వర్లు పూర్తిగా సహకారం అందించారని, ఏజెంట్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ లు  కలిసి డబ్బులు దండుకుంటున్నారని వారు ఆరోపించారు. సింగరేణి సొత్తును అక్రమంగా తరలించిన శ్రీనివాస్ ని, దించడానికి సహాయపడిన ఏజెంటు వెంకటేశ్వర్లును వెంటనే సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు టి, మనీ రామ్ సింగ్, అమానుల్లాఖాన్, బొల్లు మల్లయ్య, గద్దల నారాయణ, చింతల రమేష్, రాజ్ కుమార్ పాండే, నామసాని సత్యనారాయణ, మచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.