పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలి

Published: Friday September 23, 2022
 విద్యా శాఖ మంత్రి సబితా ఇద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 సెప్టెంబర్ ప్రజా పాలన : పోడు భూములు సాగు చేసుకుంటున్నా రైతులకు హక్కులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోడు భూములపై ఏర్పాటు చేసిన  సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించాలనే ఉద్దేశ్యంతో  ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని స్టేట్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ పోడు భూములకు శాశ్వత పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారని చెప్పారు. గ్రామ స్థాయి నుండి గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కమిటీలు వేయటం జరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ తో పాటు అనేక సమావేశాల్లో పోడు భూముల గురుంచి చర్చించి, ఆదేశాలు ఇచ్చారన్నారు.
భవిష్యత్తులో ఆక్రమణలు జరుగకుండా, అర్హులకు అన్యాయం జరగకుండా హక్కులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మరొకసారి పరిశీలించి, చర్చించి పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా స్థాయి కో ఆర్డినేషన్ సమావేశాలు పూర్తి అయిన తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి విధి విధానాలు ఖరారు చేసి త్వరలో గైడ్ లైన్స్ జారీ చేస్తామన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 111 గ్రామ పంచాయతీలలో  9647 దరఖాస్తులు వచ్చాయన్నారు. అడవులను కాపాడుకుంటూ, నిజంగా సాగు చేసుకున్న వారికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. ఈ భూముల్లో 50 శాతంకు పైగా గిరిజనులే ఎక్కువగా ఉంటారని, వారి పోడు భూముల సమస్య పరిష్కారంతో పాటు, గిరిజన భవన్ నిర్మించి,10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, గిరిజన బంధు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజనుల తరుపున మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్ల పై తీర్మానం చేసి 7 సంవత్సరాలు దాటిన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలన్నారు. రాష్ట అభివృద్ధికి ఏమాత్రం సహకారం అందించకుండా,ప్రజల్లో విద్వేషాన్ని రగిలిస్తూ బూటకపు యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. సమాజాన్ని కులాల మతాల వారీగా విభజించి పరిపాలిస్తూన్నారని,అంతా ప్రజలు గమనిస్తున్నారని మంత్రి అన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్నది మర్చిపోయి, అధికారం అంటూ బీజేపీ వాళ్ళు  అడుగుతున్నారని కేంద్రంలో 8 ఏళ్లుగా వారే అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక పనులు చేస్తూ,రాష్టాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్  పై విమర్శలు చేయడం తగదన్నారు.గిరిజన యూనివర్సిటీతో పాటు  విభజన హామీలు మర్చిన బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో10 లక్షల మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేసి మొత్తం 46 లక్షల మందికి ప్రతి నెల అందిస్తూ వారిలో చిరునవ్వులకు కారణం అవుతున్నారని పేర్కొన్నారు.వికారాబాద్ జిల్లాలో 25 వేల పెన్షన్లు నూతనంగా మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ అశోక్ కుమార్, డిఎఫ్ఓ వెంకటేశ్వర రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.