శాసనసభ్యుల భవనం ప్రారంభోత్సవం

Published: Tuesday August 24, 2021
మంచిర్యాల బ్యూరో, ఆగస్టు 23, ప్రజాపాలన : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం పరిధిలోని పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం నియోజకవర్గ శాసనసభ్యుల నివాస గృహ సముదాయం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శాసనసభ్యుల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్తో తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అందుబాటులో ఉండేందుకు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుల భవనం ఉండాలనే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం మేరకు సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నా వంతు సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్డు, భవనాల శాఖ ఈ. ఈ. రాము, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్, మంచిర్యాల, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్పర్సన్లు పెంట రాజయ్య, నల్మాను కాంతయ్య, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.